అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని కర్నూలు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేసి, ర్యాలీలు నిర్వహించారు.
కర్నూలు నగరంలో...
కర్నూలు నగరంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ నాయకులు 133వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. "మే డే" తో పాటు.... ఇవాళ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో కార్మిక సంఘాల నాయకులు జెండాలను ఎగురవేసి మేడేను జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయల్లోనూ ఆయా కార్మిక సంఘాల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో వైకాపా యునియన్ జెండాను అ పార్టీ నాయకుడు హాఫీజ్ ఖాన్ ఎగురవేశారు. అదే కార్యాలయంలో టీఎన్టీయూసీ జెండాను ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఎగురవేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ నగర్ వద్ద బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
పత్తికొండ నియోజకవర్గంలో..
పత్తికొండ నియోజకవర్గంలోని అగ్రహారం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం జరిగింది. కార్మిక అనుకూల విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలని అంతా ఆకాంక్షించారు.