ఓట్ల కోసం వాడవాడలా తిరిగే నేతలు.....ఆ తర్వాత కనీసం ముఖం కూడా చూపడం లేదు. ఇక అధికారుల సంగతి సరేసరి. తమ కాలనీల్లో మౌలిక వసతుల కోసం ధర్నాలు, వినతులతో విసిగిపోయిన కర్నూలు శివారు కాలనీవాసులు...ఓటు అనే అస్త్రంతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఓట్లు అడిగేందుకు వచ్చే నేతలను నిలదీసేందుకు సిద్ధమయ్యారు.
రాజీవ్ గృహకల్ప, వీకర్ సెక్షన్ కాలనీ, కల్లూరు ప్రాంతంలోని సుమారు 20కి పైగా కాలనీలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడి ప్రజలు మంచినీరు కొనుక్కుందామన్నా... రోడ్లు సరిగా లేక వాటర్ ట్యాంకులు రాని పరిస్థితి. వర్షం పడితే కాలనీలు చెరువులు మాదిరిగా మారిపోతున్నాయి. మురికికాలువలు శుభ్రం చేయక..దుర్గంధం ఇళ్లల్లోకి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు.
ఇళ్లపక్కన, మురుగు కాలువలు, పాఠశాలలు, కార్యాలయాల వద్దే పందులు నివాసముంటున్నాయి. ఇప్పటికీ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులతో అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పోరాడలేక తామే రోడ్లు బాగుచేసుకున్నామని... ఇప్పుడు అవీ పాడైపోతున్నాయని తెలిపారు.
తాగునీరు, మురుగునీటి నిర్వహణ, రోడ్లే తమ ప్రధాన సమస్యలని... వాటిని పరిష్కరించేంతవరకూ ఓటు వేయకూడదని నిర్ణయించకున్నామని వీకర్ సెక్షన్ కాలనీ వాసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: