Nara Lokesh Yuvagalam: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డిని జైలుకి పోకుండా కాపాడటంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర 83వ రోజు పూర్తి చేసుకుంది. పరదాల చాటును తిరిగే ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు కనపడవని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపురంలోని మిర్చి రైతులను, మాచాపురంలో రైతులను కలిసి వారి కష్టాలను లోకేశ్ తెలుసుకున్నారు.
అకాల వర్షాల కారణంగా మిర్చి, మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోతే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కనీసం సమీక్ష చేసే ఖాళీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసే దిక్కు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన మిర్చి, ఇతర పంటల రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.. తడిసి రంగు మారిన మిర్చిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్యలు కలిచి వేశాయి : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. జీవితంలో అనేక పరీక్షలు ఎదురవుతాయని.. అందులో పది, ఇంటర్ పరీక్షలు ఫెయిలైతే ఒక్క సంవత్సరమే వృథా అవుతుందని అన్నారు. ఈ మాత్రం దానికి మానవ జన్మను బలవన్మరణంతో ముగించటం అర్థరహితమని పేర్కొన్నారు. నేడు పరీక్షలు తప్పిన వారే.. రాబోయే రోజుల్లో అద్భుత ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్త కావొచ్చన్నారు. ఇప్పుడు మార్కులు తగ్గాయని తనువు చాలిస్తున్న విద్యార్థులే.. రేపు దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే నిపుణులుగా ఎదగొచ్చని తెలిపారు. అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లనేవి పరీక్షలని.. వాటిలో జయాపజయాలు ఉంటాయని వివరించారు. అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చి.. ఉన్నతోద్యోగం పొందే అవకాశాలు ఉంటాయన్నారు.
ఓడిన చోటే విజయం సాధిస్తా : తాను మంగళగిరిలో ఓడిపోయానని హేళన చేశారని.. ట్రోల్స్ చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. తాను ఓడిపోయానని పారిపోలేదని.. మరింతగా గొప్పగా పోరాడుతున్నానన్నారు. ఓటమిని చూసిన చోటే విజయం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. పరీక్ష పోతే పోయేదేమీ ఉండదన్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ముందు అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను, ప్రేమని పంచిన కుటుంబసభ్యులని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తల్లిదండ్రి, గురువు, దైవం అందరూ మీకు అండగా ఉంటారన్నారు. బంగారు భవిష్యత్తు మీ కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. దయచేసి బలవన్మరణపు ఆలోచనలు వీడి.. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజాభివృద్ధిలో వారి వంతు పాత్ర పోషించాలని కోరారు.
రైతుల మెడకు ఉరితాడు : జగన్ ఓ హాలిడే సీఎం అని లోకేశ్ ఎద్దేవా చేశారు. క్రాప్ హాలిడే, ఆక్వా, పవర్ హాలిడేలు అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని.. జగన్ పాలనలో టీడీపీ ఖర్చు చేసిన దానిలో కనీసం 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదని విమర్శించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి.. రాయలసీమ రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మీటర్లకు కచ్చితంగా కరెంట్ బిల్లులూ వసూలు చేస్తారన్నారు. టీడీపీ అండగా పోరాడుతుందని రైతులకు భరోసానిచ్చారు.
కేబినెట్లో చంచల్గూడా జైలుకి తర్వాత వెళ్ళేది ఎవరనే చర్చ తప్ప.. రైతుల సమస్యల గురించి ఏనాడూ చర్చించ లేదని ఆరోపణలు చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి.. కోర్టులో దొంగతనం కేసులో బిజీగా ఉన్నారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తామన్న జగన్.. ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు.
విషనాగులకు విరుగుడు మందు అంటూ నారా లోకేశ్ సెల్ఫీ విడుదల చేశారు. యువగళం పాదయాత్రలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అలియాస్ విషనాగు.. అవినీతి ఆనవాళ్లు పాదయాత్రలో అడుగడుగునా కన్పిస్తున్నాయని ఆరోపించారు. మంత్రాలయం నియోజకవర్గం గుడికంబాల రీచ్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్న ఇసుక లారీ విషనాగు ఇసుక దోపిడీకి ప్రత్యక్ష సాక్షి అంటూ విమర్శలు చేశారు. తను సాక్ష్యాధారాలతో బయటపెడుతున్న అక్రమాలపై సమాధానం చెప్పలేని వైసీపీ నాయకులు.. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దిగజారుడు తనానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. విషనాగులకు విరుగుడు మందు ప్రజాక్షేత్రంలో విచ్చలవిడి దోపిడీని ఎండగట్టడమేనని అన్నారు.
"సామాన్యుడు వ్యవసాయం చేయలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులను ప్రక్షాళన చేసి.. రైతులకు పెట్టుబడి ధరలు తగ్గిస్తాము. ఆ భాద్యత మేము తీసుకుంటాం. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఉండేది. ఇంకా ఇతర పథకాలు ఉండేవి. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తొలగించింది." - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి :