KVR College Land Allotment Issues: కర్నూలు నగరంలోని ప్రతిష్ఠాత్మక కేవీఆర్ మహిళా కళాశాలలో రెండు కాలేజీల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. 1958లో రాజ్‌భవన్‌గా ఉన్న భవనంలో కేవిఆర్ మహిళా కళాశాలలను ఏర్పాటు చేశారు. దాదాపు 14 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు కొనసాగుతూ వచ్చాయి. 1996లో డిగ్రీ, జూనియర్ కళాశాలలను విభజించి వేర్వేరుగా ప్రిన్సిపాళ్లను నియమించారు. ఉదయం జూనియర్ కళాశాల, మధ్యాహ్నం డిగ్రీ కళాశాలను నడుపుతున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉండటంతో కర్నూలు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి విద్యార్థినిలు అధిక సంఖ్యలో ఈ కళాశాలల్లో చేరేవారు. 2012 నుంచి ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ తొలగించటం, గదులు సైతం తక్కువగా కేటాయించటంతో.. విద్యార్థినులు ఆందోళనబాట పడ్డారు. తమకు తరగతి గదులు, హాస్టల్ వసతి కల్పించాలని 2015 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్రపతికి, మానవ హక్కుల కమిషన్ కు పోస్టుకార్డులు రాశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. విద్యార్థులకు వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది ప్రభుత్వం హాస్టల్ కోసం ఒక ఎకరా, తరగతి గదుల కోసం మరో ఎకరా కేటాయించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అది ఇప్పటి వరకు జరగలేదు. దీంతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది.
కేవీఆర్ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు ఉంది. అటానమస్ కళాశాలగా కొనసాగుతోంది. ఈ మధ్యనే క్లస్టర్ యూనివర్శిటీ అయ్యింది. ఇందులో సుమారు 2 వేల 5 వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన కళాశాలకు స్థలం కొరత ఉందని... ఉన్న పళంగా ఎకరం స్థలం, గదులు కేటాయించటం వల్ల.. తమ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారులు త్వరగా ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థునిలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుకోంటున్నారు.
ఇవీ చదవండి: