Kurnool Urdu Univeristy: రాష్ట్రంలో మొదటి ఉర్దూ విశ్వవిద్యాలయంగా పేరు గాంచిన కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ వర్సిటీ ప్రగతి అగమ్యగోచరంగా మారింది. ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగన్.. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయ అభివృద్ధిని విస్మరించారు. ప్రత్యేకించి.. ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నవారు ఉన్నత విద్య అభ్యసించడానికి వీలుగా... ముస్లిం పిల్లలకు ఉపయుక్తంగా ఉండేలా... 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... కర్నూలులో అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. 2017 నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభమయ్యాయి.
Doctor Abdul Haque Varsity Problems: ముస్లిం పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఏర్పాటుచేసిన మొదటి ఉర్దూ యూనివర్సిటీగా ఇది గుర్తింపు పొందింది. ఉర్దూలోనే పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉండటం, అధ్యాపకులు ఉర్దూలోనే బోధిస్తుండటంతో ముస్లిం విద్యార్థులకు విశ్వవిద్యాలయం అనుకూలంగా మారింది. శాశ్వత ప్రాంగణం నిర్మాణం కోసం ఓర్వకల్లులో 144.9 ఎకరాల భూమి కేటాయించారు. నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారాక ఉర్దూ విశ్వవిద్యాలయ అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోయింది.
ప్రస్తుతం ఉర్దూ వర్సిటీలో నాలుగు డిగ్రీ కోర్సులు, తొమ్మిది పీజీ కోర్సులు ఉండగా... 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి నేటి వరకు ఒక్క ఆచార్యుడిని కూడా నియమించలేదు. 15 మంది తాత్కాలిక బోధన సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ఎలాంటి పరిశోధనలూ జరగడం లేదు. తొలుత 35 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ సంఖ్యను 68కి పెంచింది. అయినా పోస్టుల భర్తీ జరగలేదు.
నూతన ప్రాంగణం నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తొలుత భావించారు. అకడమిక్ బ్లాక్, భవన నిర్మాణ పనులు తెలుగుదేశం హయాంలో ప్రారంభించారు. కొంత మేర పనులు జరిగాక ప్రభుత్వం మారడంతో మధ్యలోనే ఆగిపోయాయి. విద్యార్థినుల వసతి గృహం నిర్మాణాన్ని ప్రారంభించినా... పునాదుల స్థాయిలోనే ఆగిపోయింది. అంతర్గత రహదారుల నిర్మాణం కూడా అరకొరగానే జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో.. గుత్తేదారు పనులు ఆపేశారు. నాలుగేళ్లుగా పనులు జరగకపోవడంతో... నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగాయి. గతంలో ప్రతిపాదించిన నిర్మాణాలకు అదనంగా ప్రహరీ, తాగునీటి సౌకర్యం వంటి పనులు కూడా చేర్చడంతో... అన్నింటికీ కలిపి 49 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని తేల్చారు.
అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీకి... గుంటూరు, విశాఖలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని... ఏపీ ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. ఇప్పుడు విశ్వవిద్యాలయానికే శాశ్వత ప్రాంగణం, భవనాలు లేని దుస్థితి ఉండటంతో.. ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు అంశం కలగానే మారింది. ఉర్దూ వర్సిటీలో సుమారు 40 మంది అతిథి అధ్యాపకులు బోధిస్తున్నారు. అత్తెసరు వేతనాలతో బోధిస్తున్నా... వారికి రెండేళ్లుగా జీతాలు చెల్లించలేదు.
అబ్దుల్ హక్ విశ్వవిద్యాలయంలో శాశ్వత ఆచార్యులే కాదు.. సొంత రిజిస్ట్రార్ కూడా లేరు. యోగి వేమన వర్సిటీ నుంచి ఓ ఆచార్యుడిని డిప్యుటేషన్‌పై పంపి ఆయనకే రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సహా వివిధ విభాగాలకు సూపరింటెండెంట్లు వంటి పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి.