Mallepogu Muralikrishna murder case latest updates: కర్నూలు నగరంలోని ఎర్రబురుజు కాలనీకి చెందిన మల్లెపోగు మురళీకృష్ణ (22) హత్యకేసు మిస్టరీ వీడిందని.. కర్నూలు తాలూకా సీఐ రామలింగయ్య తెలిపారు. మురళీకృష్ణను.. కర్నూలు మండలం బాలాజీ నగర్‌కు చెందిన ఎరుకలి దినేష్, అదే కాలనీకి చెందిన తన స్నేహితుడైన కిరణ్ కుమార్‌లు కలిసి హత్య చేశారని తెలిపారు.
సీఐ రామలింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ''కర్నూలు నగరంలోని ఓ పూల అలంకరణ షాపులో విధులు నిర్వర్తిస్తున్న మురళీ కృష్ణ, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న దినేష్‌లు బాల్య స్నేహితులు. పదవ తరగతి వరకు ఇద్దరు ఒకే బడిలో చదివారు. ఈ క్రమంలో దినేష్ ఒక అమ్మాయిని ప్రేమించటం మొదలుపెట్టాడు. దినేష్..తన ప్రేయసికి సంబంధించిన పర్సనల్ వీడియోలను తన సెల్‌ఫోన్‌లో రహస్యంగా దాచుకున్నాడు. వాటిని మురళీకృష్ణ తన చరవాణిలోకి బదిలీ చేసుకున్నాడు. ఆ తర్వాత దినేష్ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేయగా.. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో మురళీ కృష్ణపై పగ పెంచుకున్న దినేష్.. అతణ్ని చంపాలని నిర్ణయించుకొని.. ఆన్‌లైన్ ద్వారా కత్తిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అదే కాలనీకి చెందిన డిగ్రీ చదివుతున్న కిరణ్ కుమార్‌ను జత చేసుకుని, కర్నూలు మండలం పంచలింగాల గ్రామ సరిహద్దుకు తీసుకెళ్లి హత్య చేశారు'' అని వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి 25వ తేదీ నుంచి తమ కుమారుడు మురళీ కృష్ణ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. కుమారుడి ఆచూకీ కోసం పలు చోట్ల గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో అనుమానమొచ్చి ఈ నెల 16న కర్నూలు తాలుకా అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ క్రమంలో మురళీ కృష్ణ స్నేహితుడు దినేశ్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. మురళీ కృష్ణను కత్తితో పొడిచి చంపామని.. అద్దెకు తీసుకున్న ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి.. నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని హంద్రీనీవా కాలువలో పడేసినట్లు దినేష్ తెలిపాడు. అంతేకాకుండా అతని బట్టలు, వస్తువులను జోహరాపురం సమీపంలో పడవేసినట్లు వెల్లడించడంతో.. పోలీసులు మురళీ కృష్ణ మృతదేహం కోసం హంద్రీ-నీవా కాలువతోపాటు పలుచోట్లు గాలిస్తున్నారు.
ఈ క్రమంలో దినేష్, కిరణ్ కుమార్‌లు రెవెన్యూ కార్యాలయంలో లొంగిపోయి నేరం అంగీకరించారని సీఐ రామలింగయ్య తెలిపారు. మృతదేహం హంద్రీనీవా కాలువ ఘటనా స్థలం నుంచి దాదాపు 10 కిలోమీటర్లు వెతికినా కనిపించలేదని.. నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించామని వివరించారు. మరోవైపు మురళీ కృష్ణ కుటుంబ సభ్యులు తమ కుమారుడి మృతదేహాన్ని కడసారి చూసే అవకాశాన్ని కల్పించాలని కన్నీరుమున్నీరవుతూ పోలీసులను వేడుకున్నారు.
ఇవీ చదవండి