Jivarallamala Tanda School Teacher Success Story: కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని చిన్న గ్రామం జీవరాళ్లమల తండా. సుమారు 6 వందల జనాభా కలిగిన ఈ తండాలోని ప్రాథమిక పాఠశాలలో హాజరు పట్టికలో 14 మంది ఉన్నప్పటికీ కేవలం ఇద్దరు పిల్లలే వచ్చేవారు. చిన్నారుల సంఖ్య తక్కువగా ఉండటంతో... బడి మూతపడుతుందన్న ప్రచారం జరగటంతో... తల్లిదండ్రులు వారి పిల్లలను పత్తికొండలోని ప్రైవేటు పాఠశాలలో చేర్పించేశారు. దీంతో పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా మారింది. స్థానికులు... మద్యం సేవించేందుకు, జూదానికి అడ్డాగా చేసుకునేవారు. అలాంటి స్థితిలో 2017 సెప్టెంబర్ 1న కల్యాణి కుమారి అక్కడికి ఉపాధ్యాయురాలిగా వచ్చారు. అక్కడి పరిస్థితులు కొంత ఆందోళన కలిగించినా... నిరాశ చెందలేదు. భర్త సాయంతో మొక్కలు తొలగించి... పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. మండల విద్యాశాఖాధికారితో కలిసి ఇంటింటికీ తిరిగి తమ పిల్లలను పాఠశాలకు పంపమని కోరారు. ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఫీజులు కట్టేశాం.. మధ్యలో పిల్లలను చేర్పించలేం అని తేల్చి చెప్పారు.
Unpaid Salaries of Teachers in AP : ఉపాధ్యాయుల వేతన వెతలు..! గురుపూజోత్సవం రోజునా ఎదురుచూపులే..
నవోద పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో అర్హత: గ్రామంలో ఇద్దరు మాత్రమే బడికి వస్తుండటంతో వారి కోసం పత్తికొండ నుంచి క్రమం తప్పకుండా కళ్యాణి పాఠశాలకు వచ్చేవారు. వారితోపాటు నేలపై కూర్చుని శ్రద్ధగా పాఠాలు బోధించేవారు. అట్టలపై బొమ్మలు వేసి మరింత అర్థమయ్యేలా చెప్పేవారు. విషయాలు మరచిపోకుండా ఉండేందుకు ల్యాప్ టాప్ లో వీడియోలు చూపించేవారు. వారితో ప్రార్థన, పాటలు, ఆటలు ఆడించేవారు. 2018 జనవరి నాటికి విద్యార్థుల సంఖ్య పదికి పెరిగింది. దీంతో ఆమెలో ఆత్మస్థ్యైర్యం పెరిగింది. విద్య సక్రమంగా అందుతున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పంపించాలి అని తండాలో చర్చ సాగింది. 2020నాటికి విద్యార్థుల సంఖ్య 55 కు చేరింది. కేవలం తరగతి పాఠాలు మాత్రమే బోధించకుండా వారికి గురుకుల, నవోద పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించేలా కళ్యాణి శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆమె మొక్కవోని పట్టుదల, కృషికి గతేడాది ఐదుగురు, ఈ ఏడాది పది మంది గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించారు.
నైతిక విలువలు బోధించటం: టీచర్ కల్యాణి కుమారి నిజాయితీ, నిబద్ధత కష్టపడేతత్వం స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తమ పిల్లల కోసం ఎంతో శ్రమిస్తున్న టీచరమ్మకు... తాము అండగా నిలవాలని భావించారు. పాఠశాల పరిసరాల్లో, ఊళ్లో మద్యం, పేకాట ఆడటం, పండుగలు, శుభకార్యాలకు పాఠశాలను వినియోగించటం చేయకూడదని నిర్ణయించారు. కేవలం పాఠాలు చెప్పటమే కాదు... నైతిక విలువలు బోధించటం, వ్యక్తిగత శుభ్రతను నేర్పటం, దీర్ఘాయుష్మాన్ భవ పేరుతో పిల్లల పుట్టినరోజులు జరపటం, అంగన్ వాడీ బడికి దోమతెరలు, పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వటం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.
'సేవలు మెచ్చి 2021లో స్థానికులు, సమీప గ్రామాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. 2022లో మహిళా దినోత్సవం పురష్కరించుకుని ఎక్స్ రే ఫౌండేషన్ వారు విజయవాడలో స్త్రీ శక్తి ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా... ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను. అదే ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం రోజున... ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందాను. ఈ ఏడాది ఏప్రిల్లో పీపుల్ సోషియల్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ... మహాత్మా జ్యోతీరావు పూలే సేవారత్న అవార్డుతో సత్కరించింది.'- కళ్యాణి కుమారి, ఉపాధ్యాయురాలు, జేఎం తండా