ఈనెల 17 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీ వేరుసెనగ విత్తన పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కర్నూలు జిల్లా జేసీ (రెవెన్యూ, రైతుభరోసా) ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు. విత్తనాల కోసం ఇప్పటివరకు ఎంతమంది రైతులు నమోదు చేసుకున్నారో మండలాల వారీగా ఆరా తీశారు. జిల్లాలో ఖరీఫ్- 21 ముందస్తు ప్రణాళికలపై బుధవారం జేడీఏ, డీడీఏలు, మండల వ్యవసాయాధికారులు, సాంకేతిక అధికారులు, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్లతో వెబ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఖరీఫ్ ప్రణాళిక అమలు, రైతులకు ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయాధికారులకు సూచించారు.
2021-22 సంవత్సరానికి విడుదల చేయనున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మొదటి విడతకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పెట్టుబడి సాయం మొదటి విడత నగదును రైతుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభిస్తారన్నారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 25న విడుదల చేయనున్న ఖరీఫ్ - 2020 పంటల బీమాకు సంబంధించిన లబ్ధిదారుల ధ్రువీకరణ ప్రక్రియను ఈనెల 15లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రసాయన ఎరువులను ముందస్తుగా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాయితీ వేరుసెనగ విత్తనాల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 3,600 క్వింటాళ్లకు 3,500 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని జేడీఏ ఉమామహేశ్వరమ్మ నివేదించారు. రైతుభరోసా పెట్టుబడి సాయం పథకానికి 5 లక్షల మంది అర్హులు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 13 వేల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనాన్ని ఆర్‌బీకేలలో నిల్వ చేశామని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎరువుల నిల్వల వివరాలను మార్క్‌ఫెడ్ అధికారులు వివరించారు.
ఇదీ చూడండి:
కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి: సీఎం జగన్