Illegal Red clay excavations at Yemmiganur : అధికారం అండదండలతో అక్రమార్కులు మట్టి మాఫియాకు తెరలేపారు. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి కోట్లు వెనకేసుకుంటున్నారు. లోతైన గుంతలు తవ్వడంతో 2 కోట్లతో నాటిన వన సంపదకు ప్రమాదం ఏర్పడింది. ఎంతో కాలంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండటంతో.. భూముల రూపురేఖలు మారిపోయాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై కథనం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారుల్లో పశుగణాభివృద్ధి కోసం 1961వ సంవత్సరంలో 2,400 ఎకరాల్లో పశుక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. పశు క్షేత్రం కనుమరుగవడంతో అందులో ప్రస్తుతం నవోదయ, బాలికల గురుకులం, బాలికల జూనియర్ కళాశాల, పశు సంవర్ధక పాలిటెక్నిక్ కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రం, ఆంబోతు వీర్య కేంద్రం వంటివి 400 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఫారం భూముల్లో ఖాళీ స్థలాన్ని అటవీ శాఖ దత్తత తీసుకుంది. 20 ఏళ్ల క్రితం 2 కోట్లతో వివిధ రకాల మొక్కలు నాటారు. అందులో ఔషధ, పండ్లు, టేకు, నీలగిరి వంటివి లక్షల మేర ఉన్నాయి. అవన్నీ పెరిగి అడవిని తలపిస్తోంది. ఇటీవల మరో 100 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ కాలనీ ఏర్పాటు చేశారు. మిగతా భూములు బీడుగా ఉన్నాయి. ఆ భూముల్లో ఉన్న విలువైన మట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.
ఎర్రమట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో... పశుక్షేత్రం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గత కొన్నిరోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు పట్టపగలే మట్టిని తరలిస్తున్నారు. గతంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ట్రాక్టర్లను పట్టుకొని జరిమానా వేసేవారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో మట్టి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ట్రాక్టర్ ఎర్రమట్టి 1500, గరుసు 1,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలతో భారీగా గుంతలు పడి... భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఎంతో విలువైన ఈ భూముల్లోని సారవంతమైన ఎర్రమట్టిని తరలించేయడం వల్ల ఈ భూములు ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదముందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
బనవాసి ఫారం భూములు ఆదోని- ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన ఉండటంతో రహదారి వైపున ఎకరం 50 లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతోంది. ఈ భూమి సారవంతమైన ఎర్ర నేలలు కావడంతో మార్కెట్‌లో మంచి డిమాండు ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ విద్యాలయాలు, కళాశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణవాసులు కోరుతున్నారు.
'కొంతమంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు ఎర్రమట్టిని తవ్వుతున్నారు. గుంతలమయంగా మార్చి దందాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం కోటి రూపాయుల ఉంటుంది.'- అదెన్న, ఎమ్మిగనూరు