AP High court: కర్నూల్లోని రాయలసీమ యూనివర్సిటీలో 2007-2012 సంవత్సరాల మధ్యలో చోటు చేసుకున్న వివిధ కొనుగోళ్ల చెల్లింపుల్లో రూ. 1.46 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని... 2013లో విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అప్పటి వీసీ జేవీ ప్రభాకర్రావు, కె.కృష్ణ నాయక్ పూర్వ వీసీ, ప్రస్తుతం ఎస్కె వర్సటీ రెక్టార్, ఎన్టీకే నాయక్, పూర్వ రిజిస్ట్రార్, ప్రస్తుతం ప్రొఫెసర్, ఎంవీ నారాయణప్ప, అప్పటి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీచేసింది. మరోవైపు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, రాయలసీమ వర్సిటీ రిజిస్ట్రార్, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ రిజిస్ట్రార్, సీఐడీ అదనపు డిజీ తదితరులకు నోటీసులిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల మేరకు ఆదేశాలిచ్చింది.
విజిలెన్స్ నివేదికను పరిగణలోకి తీసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం, సీఐడీ దర్యాప్తు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఏఐఎస్ఎఫ్ సీనియర్ నేత ఎం.కల్లప్ప హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది తాండవ యోగేశ్ వాదనలు వినిపిస్తూ .. మొత్తం బిల్లుల్లో రూ. 1.39 కోట్లకు సంబంధించిన చెల్లింపుల వోచర్లను సమర్పించడంలో అధికారులు విఫలమయ్యారని తెలిపారు. రూ. 7.70 లక్షల ఫర్నీచర్ దుర్వినియోగం చేశారని విజిలెన్స్ తేల్చిందన్నారు. మొత్తం రూ. 1.46 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని 2013 డిసెంబర్లో నివేదిక ఇచ్చిందన్నారు. క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసిందని తెలిపారు. ప్రజ ఖజానాకు జరిగిన నష్టాన్ని వసూలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: AP High Court: పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తే.. అలా చేయవచ్చు: హైకోర్టు