రైతులు పండించిన పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నూతన గోదాముల నిర్మాణానికి 2017 లో శ్రీకారం చుట్టారు. తొంభై లక్షల రూపాయలతో కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. యాభై శాతం పనులు జరిగి.. ప్రస్తుతం అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ గోదాం చుట్టూ, లోన ముళ్ల చెట్లు పెరిగి పోయాయి. తక్షణమే ప్రభుత్వం గోదాం నిర్మాణం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
నంద్యాల డివిజన్ పరిధిలోని కోవెలకుంట్ల, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో గోదాముల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. రూ.1.25 కోట్లతో రెండువేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. అలాగే బనగానపల్లెలో రూ.1. 80 కోట్లతో మూడువేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న గోదాముల పరిస్థితి ఇలాగే ఉంది. వీటిని పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు.
నూతన విధానాలతో రాబోయే కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నిధుల కొరత ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో నూతన గోదాముల నిర్మాణం ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో అసంపూర్తిగా ఉన్న వాటిపై దృష్టి సారిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తిరిగి టెండర్లు పిలిచి గోదాములను నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మొదట్లో అబ్బాయిలు సున్నితంగా ఉండి... తర్వాత ముసుగు తొలగిస్తారు