నకిలీ విత్తనాలతో చిత్తవుతున్న అన్నదాతలు అనంతపురం జిల్లా మడకశిర మండలం ఉప్పిడిపల్లి గ్రామానికి చెందిన రైతులు నాసిరకం విత్తనాలతో నష్టపోయామంటూ స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామికి వినతిపత్రం అందించారు. మడకశిరలోని ఓ ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన విత్తనాలతో తాము నష్టపోయామని రైతులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ఏ కారణం చేత రైతులు పంట నష్ట పోయారో తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. తిప్పేస్వామి సూచనల మేరకు ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నష్టపోయిన రైతుల పొలాల్లో పంటను పరిశీలించారు. దీనిపై వరి శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించి, విత్తనాలతోనే నష్టం వాటిల్లిందని తేలితే ఎరువుల దుకాణదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పారు.
కర్నూలు జిల్లాలో నష్టపోయిన ఉల్లి రైతులు..
కర్నూలు జిల్లా ఉల్లి రైతులు కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చేరువు గ్రామంలో నకిలీ విత్తనాలతో ఉల్లిరైతులు నలిగిపోతున్నారు. ఈస్ట్ వెస్ట్ కంపెనీ విత్తనాలు తెచ్చి 500 ఎకరాలలో పంట సాగుచేశారు. గతంలో ఒక ఎకరాకు 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, నకిలీ విత్తనాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని రైతులు వాపోయారు. పంట చేతికొచ్చే సమయంలో పిలకలు, పంగలు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీచదవండి.ఆనంద్ స్వామి.. ఓ దొంగ బాబా