Raging In Kurnool Medical College : ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు చట్టాలు ఉన్నా, కఠిన నిబంధనలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోంది. సీనియర్లు జూనియర్లను వేధింపులకు గురిచేస్తున్న విష సంస్కృతి బయటపడుతూనే ఉంది. కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న వైద్య కళాశాలలో మరోమారు ర్యాగింగ్ కలకలం రేపటంతో ఐదుగురు సీనియర్లు సస్పెన్షన్‌కు గురయ్యారు.
గ్రాడ్యుయేషన్ డేలో ర్యాగింగ్.. ప్రిన్సిపల్‌కు నివేదిక : బాలుర హాస్టల్‌లో ఉంటున్న ఓ జూనియర్ విద్యార్థిని మార్చి 31న కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అదే రోజు జూనియర్‌ను తమ గదికి పిలిపించి మరోమారు ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో సదరు విద్యార్థికి తండ్రి ఫోన్ చేయడంతో సీనియర్లు ఆ ఫోన్ లాక్కున్నారు. విద్యార్థి తండ్రి ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకురావడంతో ర్యాగింగ్ విషయం బయటికి వచ్చింది. వార్డెన్ పూర్తి వివరాలు సేకరించి ప్రిన్సిపల్‌కు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఈ నెల 1న ఐదుగురు విద్యార్థులను వారం రోజులు సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
జూనియర్లకు ప్రత్యేక బ్లాక్ : కర్నూలు రాజ్ విహార్ సెంటర్‌లో ఉన్న హాస్టల్‌లో దాదాపు 100 గదులు ఉన్నాయి. వీటిలో సుమారు 500 మంది విద్యార్థులు ఉంటున్నారు. ర్యాగింగ్ నివారించేందుకు మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం వార్డెన్, అసిస్టెంట్, జూనియర్ వార్డెన్లకు అక్కడే వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.
విద్యార్థి సంఘాల ఆరోపణలు : ప్రతి గదికీ సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ర్యాగింగ్ ఫిర్యాదు బాక్సులు, టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. రెండు నెలలుగా వసతి గృహంలో సీనియర్లు జూనియర్లను ఇబ్బందులు పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా ప్రిన్సిపల్ గాని, యాజమాన్యం గాని ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కఠిన శిక్షలు అమలు : ర్యాగింగ్ కట్టడికి చట్టాలు, కఠిన నిబంధనలు అమలులో ఉన్నా ప్రభుత్వాధికారులు, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో అవి ఆచరణకు నోచుకోవటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా చర్యలు కాకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయగలమని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
" ఈరోజు ఈ ర్యాగింగ్ అనేది మొట్ట మొదటి సారి జరుగుతున్న విషయాలు కాదు. గత అనేక సంవత్సరాల నుంచి ర్యాగింగ్ కారణంగా వాళ్లు ప్రాణాలు పోగుటుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కాకతీయ మెడికల్ కళాశాలలో ప్రీతి సంఘటన మనం చూశాం. " - హరీష్ కుమార్ రెడ్డి, ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు
" ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో విద్యార్థులు మెడికల్ ఫీల్డ్‌లోకి వచ్చి ఉంటారు. అలాంటి విద్యార్థుల్ని మానసికంగా, శారీరకంగా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. సీనియర్లు జూనియర్లను బానిసలుగా చూడటం సిగ్గుచేటు. " - రంగప్ప, ఎస్ఎఫ్ఐ నాయకుడు
ఇవీ చదవండి