కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని ఒకటో వార్డులో నివాసం ఉంటున్న ఖాజావలికి చెందిన మూడు ఇళ్లలో రెండు రోజులుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అంతు చిక్కడంలేదు. అరగంట, గంటకోసారి ఇల్లు మార్చి మరో ఇంట్లో మంటలు రేగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 24 నుంచి 30సార్లు మంటలు చెలరేగాయని బాధితులు తెలిపారు.
ఇళ్లలోని సామగ్రి, బియ్యం, దుస్తులన్నీ మంటల్లో కాలి బూడిద అయిపోయాయి. మంటలకు కారణాలు ఏమిటో బాధితులకు, మరోవైపు కాలనీవాసులకు తెలియక ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుంటాయి. కానీ ఈ ఇళ్లలోని మంటలు గుట్టుచప్పుడు కాకుండా చిన్న చిన్నవి గా ఉండడంతో బాధితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితులు రాలేదు. మంటలను వారే ఆర్పేస్తున్నారు. వరుస అగ్ని ప్రమాదాలతో బాధితులు ఇళ్లను ఖాళీ చేసి సామగ్రితో రోడ్డుపైనే ఉంటున్నారు. ఇంట్లో వస్తువులు ధాన్యం సగం, సగంగా కాలిపోవడంతో కట్టుబట్టలతో కుటుంబం రోడ్డున పడింది. ఇదంతా జరగడానికి అసలు కారణం తెలియక దిక్కుతోచట్లేదంటున్నారు బాధితులు. మరో వైపు ఇది దేవుడి పనా లేక దయ్యం పనా అని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.
ఘటనపై సంబంధిత అధికారులు పట్టించుకోని తమ సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ.. అనంతపురం: గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు