రహదారి విభాగినిపై వ్యవసాయం చేస్తున్నారు కర్నూలు జిల్లా గూడురుకు చెందిన మద్దిలేటి. బతుకు దెరువు కోసం కర్నూలుకు వచ్చిన మద్దిలేటి... కొన్నేళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఐదుగురు సంతానంతో కలిపి ఇంట్లో 10 మందికిపైగానే ఉంటారు. ఇసుక కొరత వల్ల 5 నెలలుగా పనుల్లేకపోవడంతో కుటుంబపోషణ కష్టతరంగా మారింది. ఈ కష్టాల్లో నుంచే ఆయన మదిలో ఓ ఆలోచన పుట్టింది. తాను నివాసం ఉంటున్న కాలనీలోని విశాలమైన రహదారి విభాగినినే పొలంగా మార్చాలనుకున్నారు. ముళ్లు, చెత్తాచెదారంతో నిండిన డివైడర్‌ను కుటుంబసభ్యులంతా కలిసి శుభ్రం చేశారు. కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు నాటి కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు.
డివైడర్‌పై కూరగాయల పంట
మద్దిలేటి నివాసముంటున్న ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం కాలనీలోని వంద అడుగుల రహదారి మధ్యలో.... విశాలమైన డివైడర్ ఉండటం ఆయనకు కలిసొచ్చింది. దీని వల్ల ఎక్కువ రకాల మొక్కలు పెంచుకునే వీలు కలిగింది. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సరిపడా కూరగాయలు పండితే చాలంటున్నారు మద్దిలేటి. నగర పాలక సిబ్బంది సైతం ఆయన ప్రయత్నాన్ని ప్రశంసించారు. మిగతా స్థలాన్ని కూడా శుభ్రం చేసి సాగుచేయమని ప్రోత్సహిస్తున్నారు.
కాలనీ వాసుల ప్రశంసలు
మద్దిలేటి ఆచరణను కాలనీ వాసులు ప్రశంసిస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లేదని.... పందులు స్త్వైరవిహారం చేసేవని.... ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతోందని చెబుతున్నారు.
వినూత్న ఆలోచనతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న మద్దిలేటిని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి :