ఈ యువకుడి పేరు మధు. తెర్నేకల్‌కు చెందిన ఇతను ఎస్జీటీ ఫలితాల్లో 334 ర్యాంకు సాధించారు.
కొలువు ఇవ్వకపోవడంతో వ్యవసాయ కూలీగా మారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
కొలువు కొట్టినా.. కూలి పనులకే
2018 అక్టోబర్ 25న 628 ఎస్జీటీ పోస్టులకు ప్రకటన ఇచ్చారు. డిసెంబర్ 24 నుంచి 2019 జనవరి 3 వరకు సెషన్‌ల వారీగా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలొచ్చిన తర్వాత విడతల వారీగా ఎస్జీటీ ఉర్దూ, కన్నడ భాషలను ఎంచుకున్న వారికి ఉపాధ్యాయ కొలువులు కేటాయించారు. మిగిలిన ఎస్జీటీ(తెలుగు) 358, ఎస్జీటీ(భాషా పండితులు) పోస్టు ఒకటి, స్కూల్ అసిస్టెంట్(తెలుగు) రెండు చొప్పున కొలువులకు నియామక పత్రాలు ఇంకా ఇవ్వలేదు. వీరందరికి ఇప్పటికే ధ్రువ పత్రాల పరిశీలన పూర్తయింది. ఇలా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం 3,600 మంది ఎదురుచూస్తుండగా, జిల్లాలో 361 మంది నిరీక్షిస్తున్నారు. ఎంపికైనా నియామక పత్రాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతున్న వేళ యువ ఉపాధ్యాయులు ఉపాధిహామీ, వ్యవసాయ కూలి పనుల బాట పడుతున్నారు.
స్పెషల్ డీఎస్సీ అభ్యర్థులకు వెంటనే...
2019లో నిర్వహించిన స్పెషల్ డీఎస్సీ పరీక్షలకు 163 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేశారు. డిసెంబరులో పరీక్ష ఫలితాలు వచ్చాయి. వీరికి ఆగమేఘాల మీద ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి, మరుసటి రోజే కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇటీవల 161 మందికి నియామక పత్రాలు సైతం అందజేశారు. రెండు పోస్టులకు సంబంధించి న్యాయస్థానంలో ఉన్నట్లు సమాచారం. స్పెషల్ డీఎస్సీ అభ్యర్థుల కంటే ముందుగా పరీక్షలు రాసిన 2018 డీఎస్సీ(ఎస్జీటీ) అభ్యర్థులకు మాత్రం నేటికీ నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఈ చిత్రంలోని తెర్నేకల్‌కు చెందిన మురళిది పేద కుటుంబం. తల్లిదండ్రులు నాగేంద్ర, ఉరుకుందమ్మ కూలి పనులకు వెళుతుంటారు. ఆ పనులు దొరక్కపోతే దుస్తులు ఉతికి, ఐరన్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మురళి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలని పట్టుదలతో చదివారు. డీఎస్సీ 2018 ఎస్జీటీ ఫలితాల్లో 30వ ర్యాంకు సాధించారు. నేటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో కుటుంబానికి భారం కాకూడదని తాను కూలి పనులకు వెళుతున్నారు.
నా పేరు విజయకృష్ణ. మాది దేవనకొండలో సాధారణ కుటుంబం. 2018 డీఎస్సీ(ఎస్జీటీ) పరీక్షల్లో 122 ర్యాంకు సాధించాను. కొన్ని కారణాలతోపాటు, ప్రభుత్వ జాప్యంతో పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. కుటుంబ పోషణకు రెండు నెలలుగా ఉపాధిహామీ పనులకు వెళుతున్నాను. ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం, వర్షాలు పడుతుండటంతో కరవు పనులు నిలిపివేశారు. పని లేకపోతే పస్తులుండాల్సిందే.
ఇదీ చదవండి: ఆసుపత్రుల్లో వసతుల కొరత అవాస్తవం: కలెక్టర్