శ్రీశైలం(srisailam)లో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు భ్రమరాంబాదేవి కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల ఐదో రోజు సోమవారం భ్రమరాంబాదేవి భక్తులకు స్కందమాతగా దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లు శేషవాహనంపై కొలువుదీరి పూజలందుకొలన్నారు. ఆలయ ప్రత్యేక వేదికపై విశేష పుష్పాలంకరణతో స్కందమాత చతుర్భుజరూపిణిగా కొలువయ్యారు.
స్కందమాతమూర్తి భక్తజనులకు అభయహస్త దీవెనలిస్తూ.. ఒడిలో స్కందుడు(కుమారస్వామి)ని కూర్చోబెట్టుకొని దివ్యమంగళస్వరూపంలో ఆసీనులయ్యారు. అమ్మవారికి అర్చకులు, వేదపండితులు పూజలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఆదిదంపతులు శేషవాహనంపై అర్చక, వేదపండితుల పుష్పార్చనలు, మంగళహారతులు అందుకొన్నారు. భక్తుల కోలాటాలు, నృత్యాల సందడి మధ్య ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఆలయ ఉత్సవం వైభవోపేతంగా సాగింది.