రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఒక్కసారిగా ఉద్ధృతరూపం దాల్చింది. ఒక్కరోజే 52 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి వరకు ఇక్కడ 4 కేసులే ఉండగా, ఆదివారం సాయంత్రానికి ఆ సంఖ్య 56కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఒక్కసారిగా ఇంత పెద్దమొత్తంలో కేసులు వెలుగుచూడటం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకు 68 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 258కి చేరింది. రాష్ట్రప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇంతవరకు కరోనా సోకినవారిలో ఐదుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. వారిలో తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలవారు ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు.
- రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు 194 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణాజిల్లాలో 32 కేసులు నమోదైనట్టుగా మొదట పేర్కొన్న ప్రభుత్వం, ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో ఆ సంఖ్యను 28కి తగ్గించింది. దీంతో శనివారం రాత్రి వరకు నమోదైన కేసుల సంఖ్య 190కి తగ్గినట్లయింది.
- శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 36 కొత్త కేసులు, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మరో 29 కేసులు నమోదయ్యాయి.
- అనంతపురం జిల్లాలో ఆదివారం మూడు కేసులు నమోదైనట్లు ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన ముగ్గురు హిందూపురం వాసులే. వీరిలో ఇద్దరికి గతంలో వైరస్ సోకినవారితో సంబంధం ఉందన్నారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 6కు చేరింది.
- రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 11 మంది, వారికి సన్నిహితంగా మెలిగిన వారు ఆరుగురు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. మిగతావారు దిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నవారు, వారికి సన్నిహితంగా ఉన్నవారు.
- కర్నూలు తర్వాత అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 34 కేసులున్నాయి. 30 కేసులతో గుంటూరు మూడోస్థానంలో ఉంది.
అత్యధిక కేసులు ఇలా..
కర్నూలు జిల్లా నుంచి దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిలోనే ఎక్కువ కేసులున్నాయి. మార్చి 27న రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తికి తొలి కేసు నిర్ధారణ అయ్యింది. మార్చి 30 నుంచి దిల్లీకి వెళ్లి వచ్చిన 338 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపడం మొదలుపెట్టారు. వీరిలో తొలుత అనుమానితుల నమూనాలు తీసుకున్నారు. తర్వాత వెళ్లివచ్చిన వారందరి నమూనాలు పరీక్షలకు పంపించారు. అనంతపురం ప్రయోగశాలలో నిర్ధారణ పరీక్షలు ఆలస్యం కావడంతో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారి అనంతపురం వెళ్లి 200 నమూనాలు తీసుకుని, వాటిని తిరుపతికి పంపారు. ఆదివారం నివేదిక రాగా.. 52 పాజిటివ్ కేసులుగా తేలాయి.
నెల్లూరులో వైద్యుడికి కరోనా.. కలకలం
నెల్లూరులో ఓ ఆర్థోపెడిక్ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొన్నాళ్ల క్రితం విదేశాల నుంచి వచ్చిన ఆయన.. ఇటీవలే నగరంలో ఆసుపత్రిని ప్రారంభించారు. దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం కరోనా అనుమానంతో జీజీహెచ్‌కు రాగా వైద్యాధికారులు నమూనాలు తీసి పరీక్షలకు పంపారు. ఆదివారం ఫలితాల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. చాలాకాలంగా అనారోగ్య సమస్యలు ఉండటం, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వైద్యుడి వద్ద ఇటీవల చికిత్స పొందినవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన వారి గురించీ ఆరా తీస్తున్నారు. వేరే ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, సిబ్బంది నమూనాలూ సేకరించి పరీక్షించేందుకు కసరత్తు మొదలైంది. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను సదరు వైద్యుడు ఆహ్వానించినా, తాను ఆ కార్యక్రమానికి వెళ్లలేదని మంత్రి అనిల్ ‘ఈనాడు’కు స్పష్టం చేశారు.