కర్నూలు జిల్లాలో పుష్కరాల సమయంలో హుషారుగా కనిపించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ నీరసించింది. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్‌కి ఏర్పాట్లు చేయలేదు. అనుమానం ఉన్నవారికి కరోనా పరీక్షలు చేసే కేంద్రాల వైపు అడుగులు అంతంతమాత్రమే పడ్డాయి. ఊహించని విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే అప్పటికప్పుడు ఏం చేయలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కో ఘాట్‌కు ఒక్కో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఢంకా మోగించారే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. సంకల్‌బాగ్ మినహా మిగిలినచోట్ల అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి.
ఇప్పటికైతే ఊసేలేదు..
జిల్లాలో అన్ని పట్టణ కూడళ్లలో కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రచార వాహనాలను ఏర్పాటు చేయలేదు. కనీసం కార్పొరేషన్ అధికారులను సంప్రదించి ప్రచార వాహనాలను ఉపయోగించుకోవాలన్న ప్రయత్నాలు జరగలేదు. ఇంతవరకు ఎక్కడా నిబంధనలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టలేదు. నగరవాసులకైనా చైతన్యం కల్గించేలా కరపత్రాల ముద్రించినా ఆశించిన స్థాయిలో పంపిణీ జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పుష్కర నిధుల్లేవు
వైద్య, ఆరోగ్య శాఖ పుష్కరాలకు సంబంధించి 9 పనులకు రూ.1.84 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్ నుంచే నిధులు వాడుకోవాలని సూచించింది. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసే వైద్యశిబిరాలకు కావాల్సిన మందులు, ఫాగింగ్ యంత్రాలను ఏపీహెచ్‌ఎంఐడీసీనే కొనుగోలు చేసి అందించింది. శిబిరానికి ఇద్దరు వైద్యులకు విధులు నిర్వహించేలా ప్రణాళికలు చేశారు. దీనిపై డీఎంహెచ్‌వో రామగిడ్డయ్యను వివరణ కోరగా...ఫ్లెక్సీలు, పోస్టర్లు సిద్ధంగా ఉన్నాయని, ఏర్పాటు చేస్తామన్నారు. తెల్లవారితే పుష్కరాలుంటే ఇంకా ఏర్పాటు చేస్తామనే ఆలోచనలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు.
ఇదీ చదవండి: అలల సిరులవేణి.. సస్యసీమల రాణి