CM JAGAN TOUR: కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి జగన్ నేడు పర్యటించనున్నారు. ఆదోనిలో జగనన్న విద్యాకానుకను ప్రారంభించి.. కిట్లు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 47.40 లక్షల మందికి రూ.931.02 కోట్లతో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం 9.50 గం.కు ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఆదోని వెళ్లనున్నారు.
7న వైయస్‌ఆర్ జిల్లాకు సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ ఈనెల 7వ తేదీన వైయస్‌ఆర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ నియోజకవర్గ సమీక్షతోపాటు, పార్టీ నాయకుల మధ్య సమన్వయంపై చర్చిస్తారు. గురువారం రాత్రి ఇడుపులపాయలోనే బస చేసి 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన సమాధి వద్ద జగన్ నివాళులర్పిస్తారు. తర్వాత బయలుదేరి గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో నిర్వహించే వైకాపా ప్లీనరీకి హాజరవుతారు.
25 జిల్లాల సమీక్ష
ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న వైకాపా ప్లీనరీ ముగిశాక.. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. 25 రోజులపాటు వీటిని నిర్వహించే అవకాశం ఉంది. పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను కలిపి ఒక రోజు సమీక్షించనున్నారు. జిల్లాల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గుర్తించిన ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఉన్న నిధులు సరిపోతాయా లేక ప్రభుత్వం నుంచి అదనపు నిధులను ఏ మేరకు విడుదల చేయాలి. తదితర అంశాలపై సీఎం చర్చించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు చొప్పున అప్పుడే విడుదల చేయవచ్చని సమాచారం. అలాగే ప్రతీ జిల్లా కలెక్టర్‌కూ రూ.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తారని తెలిసింది.
ఇవీ చదవండి: