కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు వాతావరణానికి అనుకూలంగా వ్యవసాయం అనే అంశంపై రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాబార్డు సీజీఎం పీ బెహరా ముఖ్యఅతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. వాతావరణంలో వచ్చే హెచ్చు తగ్గుల గురించి తెలుసుకుని... శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్లాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇతర రైతులకు తెలియజేయాలన్నారు.
రైతులు వారి వారి పొలాల్లో ఇద్దరు ముగ్గురు కలిసి చిన్నపాటి వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని నాబార్డు డీజీఎం రామలక్ష్మి అన్నారు. రెండు రోజుల శిక్షణా తరగతుల్లో సేంద్రియ ఎరువుల తయారీ, నీటి కుంటలు ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు, సేంద్రియ వ్యవసాయం ఇతర అంశాలను రైతులకు వీడియోల ద్వారా చూపించి శిక్షణ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో రైతులను తీసుకెళ్లి వ్యవసాయ పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 40 మంది రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : 'ఈడబ్ల్యూఎస్‌కు 10 రిజర్వేషన్లు అమలుచేయాలి'