atmakur incident: ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వమే ముద్దాయి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఆత్మకూరులో పోలీసులపై కూడా దాడి జరిగిందన్నారు. శ్రీకాంత్‌రెడ్డిని చంపేస్తామంటూ బెదిరించిన ఆడియో ఉందన్న సోము వీర్రాజు.. శ్రీకాంత్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు.
Somu Veerraju fires on YSRC Govt: వైకాపాకు అధికారమిచ్చింది.. అరాచక పాలన చేయడానికా? అని సోము వీర్రాజు నిలదీశారు. అంజాద్ బాషా, మరికొంతమంది కలిసి విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. శ్రీకాంత్ రెడ్డి, భాజపా నేతలపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైకాపా తీరు మార్చుకోకపోతే తాడోపేడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆలోచనేంటి..?
సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం ఆలోచనేంటి? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇసుక ధరలు ఎందుకు తగ్గించరు.. ప్రజలకు అవసరం లేదా? అని ఆక్షేపించారు. సినిమా టికెట్ ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకోవడమేంటన్న ఆయన.. ధాన్యం కొనేవాళ్లు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో వైకాపా నేతలదే కీలక పాత్ర సోము వీర్రాజు ఆరోపించారు.
ఆత్మకూరులో ఏం జరిగిందంటే..?
Tension at Atmakur City: కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జనవరి 8వ తేదీన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ నిర్మాణం విషయంలో సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో.. రాళ్లు రువ్వుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ఓ వర్గంవారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కారు ఒక్కసారిగా మనుషులపైకి వెళ్లటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన మరో వర్గం... శ్రీకాంత్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు.. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: CM Jagan: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్