Bank Loans for Votes in Kurnool DCCB: ఎన్నికల ప్రకటన రాలేదు.. ఎమ్మెల్యే అభ్యర్థులూ ఖరారు కాలేదు. కర్నూలు జిల్లాలో మాత్రం అధికార పార్టీ నేతలు మాత్రం తాయిలాలు ఇచ్చేస్తున్నారు. సీటు నాకే వస్తుంది.. నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటా మీరంతా సహకారం అందించాలి అని ఓ నేత ఎర వేస్తున్నారు. సదరు నేత భార్య అధ్యక్షురాలిగా ఉన్న సహకార కేంద్ర బ్యాంకును ఇందుకు పావుగా వాడుకుంటున్నారు. రుణాలు ఇప్పిస్తున్నారట.. వాటిని చెల్లించాల్సిన అవసరమూ లేదని ప్రచారం సాగుతుండటంతో ఖాతాలు తెరిచేందుకు జనం కర్నూలులోని సహకార బ్యాంకు బ్రాంచిల వద్ద బారులు తీరుతున్నారు.
కర్నూలు శాసనసభ నియోజకవర్గ అధికార పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు (Group Politics in Kurnool) నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందని ఇద్దరూ ప్రచారం చేసుకుంటున్నారు. తన భార్య బరిలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఏకంగా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆమె జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. పైసా ఖర్చు లేకుండా బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి ఓట్లు దండుకోవచ్చని ముందస్తు వ్యూహం పన్నారు. ఆ బ్యాంకు పరిధిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా కేవలం ఒక్క కర్నూలు నియోజకవర్గం వారికే రుణాలిప్పించే పనిలో పడ్డారు.
ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీలో వర్గపోరు.. తీవ్ర ఆసంతృప్తిలో నేతలు
చిరు వ్యాపారాలు చేసుకునే నలుగురు వ్యక్తుల బృందంగా ఏర్పడితే వారికి లక్ష రూపాయల రుణం ఇస్తారు. ఈ రుణాన్ని రెండేళ్లలో తిరిగి చెల్లించాలి. కర్నూలు నియోజకవర్గంలో నాలుగు వేల బృందాలకు 40 కోట్ల రూపాయల మేర రుణాలు ఇవ్వాలని సదరు నేత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రక్రియ ప్రారంభించారు.. ఇందుకు సంబంధించి ఖాతాలు తెరుస్తున్నారు. కర్నూలు నియోజకవర్గంలో మొత్తం 33 వార్డులున్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంతోపాటు మూడు బ్రాంచిలు ఉన్నాయి. ఒక్కో బ్రాంచికి కొన్ని వార్డులు కేటాయించి, లక్ష్యాలు విధించారు. తాను చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని ఆ నేత బ్యాంకు అధికారులకు హుకుం జారీ చేశారని తెలుస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2017-18 నుంచి 2021-22 వరకు అయిదు వేల జేఎల్‌జీ గ్రూపులకు సుమారు 30 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. చాలావరకు వాటిని తిరిగి చెల్లించకపోవడంతో.. బ్యాంకు నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. దీంతో 2023 నుంచి వాటిని నిలిపివేశారు. వాస్తవంగా సహకార కేంద్ర బ్యాంకు రైతులను వెన్నుదన్నుగా ఉండాలి. ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి. 5 లక్షల మంది రైతులు సభ్యత్వాలు తీసుకున్నారు. ఖరీఫ్‌లో 400 కోట్ల రుణ మొత్తాన్ని నవీకరణ చేశారు. ప్రస్తుతం రబీకి ఇప్పటి వరకు కేవలం 10 కోట్లు మాత్రమే రుణాలుగా ఇచ్చారు. రైతులు రుణాలడిగితే రోజుల కొద్దీ తిప్పించుకుంటారు.. కానీ అధికార పార్టీ వారు చెప్పిన వారికి క్షణాల్లో మంజూరు చేయడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
Anilkumar Vs Roopkumar: సీఎం రాజీ కుదిర్చినా.. ఆగని ఆరోపణలు, దాడులు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. అందులో ఒక్క కర్నూలు నియోజకవర్గానికే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలంటున్నారు.. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇదే తరహాలో పట్టుబడితే బ్యాంకు పరిస్థితి ఏమిటని అధికారులు అంతర్మథనం చెందుతున్నారు. 35 ఏళ్లకు పైగా నష్టాలబాటలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మూడేళ్లుగా లాభాల బాటలో నడుస్తోంది. వైకాపా నేతల ఓట్ల రాజకీయంతో తిరిగి నష్టాలబాట పట్టనుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు ఓల్డ్ టౌన్ బ్రాంచి పరిధిలో మొత్తం 12 వార్డులకు గానూ వెయ్యి జేఎల్‌జీ బృందాలకు రుణాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చెప్పినట్లు బ్రాంచి చీఫ్ మేనేజర్ రమేష్ తెలిపారు. ప్రస్తుతం బృందాల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్లు వివరించారు.
రాయలసీమ వైసీపీలో రోడ్డెక్కుతున్న వర్గపోరు.. కలకలం రేపుతున్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలు