శ్రీశైలం దేవస్థానంలో... దర్శనం, అభిషేకం టిక్కెట్ల సొమ్మును అక్రమార్కులు పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ను మార్చి... మూడేళ్ల వ్యవధిలో కోటీ 42 లక్షల రూపాయలు స్వాహాచేసినట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ఇప్పటికే ఆలయ అధికారులు శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో నిందితులుగా భావిస్తున్న 20 మందిపై మోసం, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ కమిటీ... సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మోసానికి పాల్పడిన తీరు, ఇతర అంశాలపై విచారణ చేపట్టనుంది. డీఎస్పీ వెంకట్రావు నేతృత్వంలోని మరో కమిటీ... నిందితులను అదుపులోకి తీసుకుని.. విచారణ వేగవంతం చేయనుంది. రెండు కమిటీలు... టికెట్ల సొమ్ము పక్కదారి పట్టిన వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేయనున్నాయి.
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో.. 2016లో రూ.42 లక్షల కుంభకోణం జరిగింది. ఇందులో ఇద్దరు రెగ్యులర్, ఇద్దరు తాత్కాలిక ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు తేల్చి వీరిపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత మరో ఉద్యోగి... కైలాస కంకణాల విషయంలో రూ.3 లక్షలు అవినీతికి పాల్పడ్డాడు.
ఈ ఏడాది జనవరిలో విరాళాల కేంద్రంలో... ఒప్పంద ఉద్యోగి నాగేశ్వరరావు 14.70 లక్షల రూపాయల అవినీతి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ విచారణలో మరో ఇద్దరు ఒప్పంద ఉద్యోగులు రూ.56 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారాలన్నింటిపై.. శ్రీశైలం దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని భక్తులు అంటున్నారు.
ఇదీ చదవండి : దేవాలయాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి: పరిపూర్ణానంద