Andhra devotee presents diamond crown to Lord Ayyappa: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ అయ్యప్ప భక్తుడు.. శబరిమల అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. నంద్యాల పట్టణానికి చెందిన మారం వెంకటసుబ్బయ్య, ఆయన కుమారుడు మారం శ్రీనివాసులు.. శబరిమల అయ్యప్ప స్వామికి వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటం బహూకరించారు. వెంకటసుబ్బయ్య.. శుక్రవారం ఆలయంలో కేరళ హైకోర్టు న్యాయవాది సాయంతో కిరీటాన్ని శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడికి అందజేశారు. గతేడాది కరోనా బారిన పడిన సమయంలో తాము కోలుకోవాలని వెంకటసుబ్బయ్య మొక్కుకున్నారు. ప్రస్తుతం ఆ మొక్కులో భాగంగా కిరీటాన్ని బహూకరించారు. అయితే ఆ కిరీటం వెల ఎంత అనేది వెల్లడించలేదు. నంద్యాల అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు మారం శ్రీనివాసులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు వీరబొమ్మన సత్యనారాయణ, బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య, శ్యాంసుందర్ గుప్తా.. వారిని అభినందించారు.
వజ్ర కిరీటాన్ని నైవేద్యంగా సమర్పించాలని...
గత 30ఏళ్లుగా.. విరామం లేకుండా శబరిమల ఆలయాన్ని సందర్శిస్తున్న అయ్యప్ప భక్తుడు మారం వెంకటసుబ్బయ్య. ఇటీవల ఆయన కొవిడ్ భారీన పడటంతో ఆసుపత్రిలో చేరారు. మరణం అంచుల వరకు వెళ్లాడు. ఆ సమయంలో తాము కోలుకోవాలని అయ్యప్పకు మొక్కుకున్నారు. అనంతరం వైరస్ నుంచి అతను కోలుకున్నారు. అయ్యప్ప భగవానుడి ఆశీర్వాదం వల్లే తాను బతకగలిగానని.. శబరిమల ఆలయానికి వజ్ర కిరీటాన్ని నైవేద్యంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు.
న్యాయవాది సాయంతో...
కిరీటాన్ని సమర్పించేందుకు ఆలయ అధికారులతో మాట్లాడేందుకు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తన స్నేహితుడిని సంప్రదించారు. అతని సాయంతో శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడికి కిరీటాన్ని అందజేశారు.
ఇదీ చదవండి..
శబరిమల 'మకరజ్యోతి' దర్శనం- భక్తజనం పరవశం