AP Assembly Agenda on Sixth Day : శాసనసభ సమావేశాలు ఆరవ రోజులో భాగంగా సోమవారం ఇప్పటికే ప్రవేశ పెట్టిన ఏడు బిల్లులపై సభలో చర్చ జరగనుంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనుండగా, మున్సిపల్ చట్టసవరణ బిల్లును మంత్రి నారాయణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఆయుర్వేదిక్, హోమియోపతి, వైద్య ప్రాక్టీస్ చేసే వారి రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లులను మంత్రి సత్య కుమార్ యాదవ్, ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్, సహకార సోసైటీల చట్ట సవరణ బిల్లుని మంత్రి అచ్చెన్నాయుడులు ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ జరగనుంది. వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు.
శాసన సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా నిత్యావసరాల ధరల పెంపు, గాజులదిన్నె తాగునీటి పథకం, అసైన్డ్ భూములు, ఈనాం భూములు, విజయనగరం జిల్లాలో అతిసారం వ్యాప్తి తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. కేంద్ర నిధులతో గృహాల నిర్మాణం, ఏపీఎస్ఆర్టీసీ, మల్లవల్లి పారిశ్రామికవాడ, రాష్ట్రంలో మత్స్య రంగం, విశాఖలో ఇళ్లపట్టాలు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. శాసన సభ ఆమోదించిన వివిధ బిల్లులను సంబంధిత మంత్రులు సోమవారం మండలిలో ప్రవేశ పెట్టనున్నారు.
'ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్‌గా మారిపోయింది - వారిపై చర్యలు తీసుకోవాలి'
బడ్జెట్‌పై చివరి రోజు చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండలిలో సమాధానం ఉంటుంది. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో భాగంగా మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు, కర్నూలు జిల్లాలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణం, జాబ్ క్యాలెండర్, కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల నుంచి నిధులు మల్లింపు , అంగన్వాడీ భవనాలు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. గృహ వినియోగదారులపై అదనపు భారం, బాల సంజీవిని పథకం, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు, ఇమామ్, మౌసమ్‌లకు గౌవర వేతనం, రాష్ట్రంలో వయోజన వైద్య కేంద్రాలు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
'రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది - ఐదేళ్లూ అడవి పందుల తరహాలో మేశారు'
సోమవారం శాసనసభలో రాష్ట్రంలోని 8 డివిజనల్, 4 రైల్వే జోనల్ కమిటీలకు సంబంధించిన సభ్యుల ఎన్నిక తీర్మానం చేయనున్నారు. రైల్వే జోనల్, డివిజనల్‌కు యుజర్ కన్సల్టెవ్ కమిటీలకు స్థానిక శాసన సభ్యులను ఎన్నుకునేందుకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. రెండేళ్ల కాలానికి సభ్యులను ఎన్నుకునేలా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో కీలకమైన అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.
'జగన్ అలిగి ఇంట్లో కూర్చుంటే కుదరదు - చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి'