సేంద్రియ ఉత్పత్తుల ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో ఆ యువ రైతు అత్యంత శ్రద్ధతో ఆవులను పోషిస్తున్నారు. ఏకంగా 450కిపైగా గోవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నారు. ఆవు నుంచి పాలను సేకరించకుండా దూడలకే వదిలేస్తున్నారు. దూడ వదిలేసిన పాలు ఉంటేనే పిండుకుంటున్నారు. గోమూత్రం, పేడతో ఉత్పత్తులను తయారుచేసి మార్కెటింగ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన చాంద్‌బాషా గోసంరక్షణ తీరిది. చాంద్‌బాషా కుటుంబీకులంతా ఆయనకు సహకరిస్తున్నారు. తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో సేకరించిన పేడను హోమానికి అవసరమయ్యే పిడకలుగా తయారు చేస్తున్నారు. 2016 సెప్టెంబరు నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అప్పుడే ‘స్వదేశీ గోఉత్పత్తులు’ పేరిట మార్కెటింగ్‌ను ప్రారంభించారు. 2018నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెరిగాయి. నెలనెలా 2 లక్షల పిడకలను తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి, ముంబయి తదితర నగరాలకు పంపుతున్నారు. అలాగే ధూప్‌కడ్డీలను ప్రతి నెలా 10కిలోల వరకు తయారుచేసి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు పంపుతున్నారు. ‘ఆయుష్’ ద్వారా లైసెన్సు పొంది గోమూత్రంతో ‘ఆర్క్’ తయారుచేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న ఆవు మూత్రాన్ని నేరుగా సేకరించి 60-70 డిగ్రీల వరకు మరిగించి ఆవిరి ద్వారా నీటిని సేకరిస్తారు. మరిగించే సమయంలో తిప్పతీగ, తులసి కలుపుతారు. ఇలా ప్రతి నెలా 2వేల లీటర్లు తయారు చేస్తున్నారు. ఈ ‘ఆర్క్’నే అమృతవల్లిగా పిలుస్తారు. దూడ తాగాక మిగిలిన పాలను పూజలకు, చంటి పిల్లల కోసం అడిగిన వారికి ఇస్తున్నారు. ఇంకా మిగిలితే నెయ్యి తయారుచేస్తున్నారు. ప్రకృతి సేద్యానికి అవసరమైన ఘన జీవామృతం, దశపర్ణి కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రం, పంచగవ్యను అందుబాటులో ఉంచారు. పాలేకర్ శిష్యుడు విజయ్‌రామ్ నడుపుతున్న ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థకు ఘనజీవామృతాన్ని పంపుతున్నారు. గోసంరక్షణకు బాషా ప్రయత్నాలను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలుసుకొని సన్మానించారు. ఆవులకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తానని చాంద్‌బాషా అంటున్నారు.
ఇదీ చదవండి: curb plastic : 'ప్లాస్టిక్ హఠావో- కర్నూలు బచావో'... ప్లాస్టిక్‌ను అరికట్టేందుకు నూతన కార్యక్రమం