Young Man Making Cow Based Products: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వడ్డీ కృషి అనే వ్యక్తి ఎంసీఏ పూర్తి చేసి చెన్నైలో లక్షల రుపాయల జీతంతో ప్రముఖ సంస్థ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధ ఆహార ఉత్పత్తుల వంటి వాటిపై ఆసక్తి పెంచుకుని సేంద్రియ వ్యవసాయం చర్చల్లో పాల్గొనేవారు. పాలేకర్, రాజీవ్ దీక్షిత్ ప్రసంగాలను స్పూర్తిగా తీసుకుని సేంద్రియ వ్యవసాయంలో నూతన మార్గాలు, గో ఆధారిత ఉత్పత్తులు ఉత్పత్తి చేయాలని భావించారు. పట్టణానికి సమీపంలోని సీతారాంపురం గ్రామంలో అర ఎకరం పొలం కొనుగోలు చేసి, 2015 సంవత్సరంలో ఒక్క ఆవుతో 1 లక్ష పెట్టుబడితో గోశాల ప్రారంభించారు. ప్రస్తుతం చిన్నా, పెద్దా కలుపుకొని అక్కడ 40 గోవులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 80 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచకాలతో 80 రకాల ఉత్పత్తుల తయారీతో కుటీర పరిశ్రమను విస్తరించారు.
విదేశాల్లోనూ మంచి ఆదరణ.. తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తాను గో ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తానని.. చెప్పిన సమయంలో కృషి.. కుటుంబ సభ్యులు కొన్ని సందేహలను వ్యక్తం చేసినా కృషిపై ఉన్న నమ్మకంతో వారు ప్రొత్సహించారు. వారు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం స్వదేశీ మందిర్ పేరుతో మచిలీపట్నంలో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేశారు. గో ఆధారిత ఉత్పత్తులకు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తుందని కృషి చెబుతున్నారు. మచిలీపట్నం నుంచి గో ఆధారిత ఉత్పత్తులను అమెరికా, లండన్ వంటి దేశాలకు పంపడం జరుగుతుందన్నారు. తన ఉత్పత్తుల విక్రయాలకు గోశాల ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించడం జరిగిందని తెలిపారు.
మరోక రెండు దుకాణాలు.. మచిలీపట్నంతో పాటు విజయవాడ సమీపంలోని పొరంకి, హైదరాబాద్‌లో మరోక రెండు స్వదేశీ మందిర్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు కృషి తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్న స్వదేశీ మందిర్‌ను కృషితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చూస్తున్నారు. గోశాల నిర్వహణ, ఉత్పత్తుల తయారీ.. వాటి విక్రయం వంటి పనుల కోసం మరో 40 మందిని నియమించుకుని వారికి ఉపాధి కల్పించారు. ఉన్న గ్రామంలో ఉపాధి లభించడం చాలా సంతోషంగా ఉందని ఉత్పత్తులు తయారు చేస్తున్న మహిళలు తెలిపారు. స్వదేశీ మందిర్ పర్యావరణానికి, మునుషులకు ఎటువంటి హనీ కలిగించని తెలిపారు.
గోశాల పేరుతో శిక్షణ.. ఒక్క గ్రాము ఆవు పేడ, గో మూత్రం కూడా వృథా కానివ్వకుండా భద్రపరిచి వాటితో సహజ సిద్ధమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులకు అందిస్తున్నారు. గోశాల నిర్వహణలో ఆదర్శంగా నిలవడమే కాకుండా.. ఆసక్తి ఉన్న వారికి గోశాల పేరుతో శిక్షణ ఇస్తున్నారు. తాను ఉన్నత స్థాయికి వెళ్లడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి చూపించే స్థాయికి ఎదిగిన కుమారుడిని చూసి కృషి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గిరాకి ఉన్న ఉత్పత్తులు.. గోమూత్ర ఆరుకు, నెయ్యి, సబ్బులు, షాంపులు, కుంకుమ, కాటుక, ఇతర సౌందర్య ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆవు నెయ్యితో తయారు చేసిన కాటుక, కుంకుమకు మంచి గిరాకి ఉంటుంది.
ఇవీ చదవండి: