కరోనా వ్యాప్తి కారణంగా.. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన గ్రామాల్లో... ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఎంపీ బాలశౌరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, నూతన సచివాలయానికి భూమి పూజ చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో జరిగింది. మండలం పరిధిలో వెంట్రప్రగడ, వానపాముల గ్రామాల్లో సుమారు 50 కరోనా కేసులు నమోదు కాగా.. మరో 150 మంది అనుమానితుల ఫలితాలు రావాల్సి ఉంది. అప్రమత్తమైన అధికారులు 2 గ్రామాలను కంటైన్మోమెంట్ జోన్లుగా ప్రకటించారు.
నిబంధనలు ఉల్లంఘించి పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి... పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నూతన సచివాలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధి వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ఉన్న డ్వాక్రా మహిళలతో వెంట్రప్రగడలో సభ నిర్వహించారు.
కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న రెండు గ్రామాల్లో ఈ విధంగా ర్యాలీలు, సభలు నిర్వహించడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ప్రజలకు మాత్రమేనా.. పాలకులకు వర్తించవా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటం వలన కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: