TDP National Spokesperson Pattabhiram fire on Cm Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పులు రాతలు రాయించి.. టీడీపీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగితే గనుక.. 2,11,984 మంది శిక్షణ ఎలా తీసుకున్నారు? 64వేల మంది యువతకు ఉపాధి ఎలా లభించిందో? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ విషయానికి సంబంధించి పట్టాభిరామ్ విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో రూ.330 కోట్ల అవినీతి జరిగితే, శిక్షణా కేంద్రాలు నెలకొల్పిన 40 కళాశాలల యాజమాన్యాలు, పరికరాలు, వస్తువుల వివరాలతో కూడిన లేఖలు ఎందుకు ఇచ్చాయని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తమ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రానికి అన్ని రకాల వస్తువులు, పరికరాలు అందినట్టు కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఇచ్చిన లేఖపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతాడని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు.
అనంతరం సీఎం జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గానీ, అయన కుటుంబ సభ్యులపై గానీ రవ్వంత అవినీతిని కూడా అంటించలేరని పట్టాభి తేల్పి చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కి, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కి సంబంధం ఉందంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని పట్టాభి స్పష్టం చేశారు. అసలు నారా లోకేశ్‌కి, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌తో సంబంధమే లేదని ఆయన స్పష్టతనిచ్చారు.
'యువగళం' పేరుతో గత 37 రోజులుగా నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ పాదయాత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పనులు, అరాచకాలను, వైఎస్సార్సీపీ నాయకుల అసలు స్వరూపాలను బట్టబయలు చేస్తున్నారనే ఉద్దేశ్యంతో అకారణంగా ఆయనపై బురదజల్లేందుకు తప్పుడు రాతలకు పూనుకున్నారని పట్టాభి మండిపడ్డారు. డిజైన్ టెక్, షెల్ కంపెనీలకు చెందిన పలువురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ రాసిన రాతలపై పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు.
''షెల్ కంపెనీలు పెట్టారని రాశారు కదా..ఎక్కడ పెట్టారో? ఎప్పుడు పెట్టారో? ఆ కంపెనీల పేర్లేంటో రాయలేదు ఏంటి..? సీఐడీ అధికారులు దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ కేసును విచారిస్తున్నారా కదా.. ఏమీ నిగ్గు తేల్చారో చెప్పండి. ఎక్కడినుంచి ఎక్కడికెళ్లింది డబ్బు..?. మీ దగ్గర ఒక్క కంపెనీ పేరైనా ఉందా..? ఏమీ లేకుండానే ఈ తప్పులు రాతలు ఎలా రాస్తున్నారు.'' అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పలు ప్రశ్నలు సంధించారు.
ఇవీ చదవండి