వైకాపా ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలను అవమానిస్తూ రాజ్యాంగ దినోత్సవం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. స్మృతివనం పనులు నిలిపివేయటంతో పాటు అక్కడ అంబేడ్కర్ విగ్రహాలు మాయమైనా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ఇక్కడ జరిగినట్లు ఎక్కడా జరగట్లేదు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే అంబేడ్కర్ రాజ్యాంగమా? అని యనమల ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూస్తే అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్నన్ని దాడులు దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. శిరోముండనాలు, ఆడబిడ్డలపై గ్యాంగ్‌రేప్‌లు, హత్యలు వంటి కిరాతక కాండ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదని తెలిపారు.
ముందు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోండి
సీఎం జగన్‌కు రాజ్యాంగంపై గౌరవం ఉంటే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. శాసనమండలి, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ న్యాయవవస్థను గౌరవించాలని హితవు పలికారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని సూచించారు. సామాజిక మాధ్యమ కార్యకర్తలు, రైతులపై కేసులుపెట్టి జైలుకు పంపడం అంబేడ్కర్ రాజ్యాంగం కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు.
ఇవీ చదవండి..
నిరంకుశ పోకడలను అడ్డుకున్నప్పుడే రాజ్యాంగానికి ఔన్నత్యం: చంద్రబాబు