కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగాయలంక శివారు బ్రహ్మానందపురానికి చెందిన కూలీ ఆరుంపాక సద్గుణ రావు దారుణ హత్యకు గురయ్యాడు. సద్గుణరావు తలపై సబ్బినేని మురళి ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నాగాయలంక గ్రామానికి చెందిన సబ్బినేని మురళి అన్న సబ్బినేని అనిల్ మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి.
కొంతమంది కూలీలతో ఒప్పందం..
నాగాయలంక గ్రామ పంచాయతీ నోటిస్ మేరకు అనిల్ తన నివాసంలోని సామగ్రిని మరో చోటకి తరలించేందుకు కొంతమంది కూలీలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో కూలీలు సామాన్లను బస్టాండ్ మార్గం గుండా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న సబ్బినేని మురళి ఆటోను అడ్డగించాడు. సామగ్రి తరలిస్తున్న నేపథ్యంలో ఆటోలోని రాడ్డు తీసుకుని కూలి ఆరుంపాక సద్గుణ రావు తలపై మురళి అమానుష దాడికి పాల్పడ్డాడు.
డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ