వికాస్....వయసు....మూడున్నరేళ్లు. ఊరు....కృష్ణాజిల్లా గన్నవరం మండలం సవారిగూడెం గ్రామం. ఈ చిన్నారి మాటల వింటే పేరుకు తగ్గట్టుగానే జ్ఞానంలో వికసించాడా అనిపిస్తుంది. ఆంగ్ల అక్షరాల నుంచి ఆసియా దేశాల వరకు.. ఖండాలు, మహాసముద్రాలు, గ్రహాలు, నదులు....శరీర భాగాల నుంచి జ్ఞానేంద్రియాల వరకు ఇలా అన్నిటినీ టకటకా చెప్పేస్తూ అందరితో ఔరా అనిపిస్తున్నాడు. డిగ్రీలు, పీజీలు చేసిన వారికి సైతం కష్టంగా అనిపించే రాష్ట్రాలు, దేశాలు వాటి రాజధానులను సునాయాసంగా చెప్పేస్తున్నాడు. స్కూల్‌కి వెళ్లకుండానే... అప్పుడప్పుడు అమ్మ చెప్పే మాటలను చిట్టి బుర్రలో దాచుకుని అందరి దృష్టీ ఆకర్షిస్తున్నాడు.
ఏక సంతాగ్రహి
జనరల్నాలెడ్జ్తోపాటు రామాయణ, మహాభారతాలనూ ఇట్టే వల్లిస్తున్నాడు. ఏడాదిన్నర నుంచే రంగులను గుర్తుపట్టడం, చెప్పినదాన్ని ఇట్టే పట్టేసి... అడిగిన వెంటనే ఠక్కున చెప్పేయడం అలవాటుగా మార్చుకున్నాడు. పిల్లాడి ఉత్సుకత గమనించిన తల్లిదండ్రులు ఇంటి వద్దే వాడి ఆసక్తికి తగిన అంశాలు బోధిస్తున్నారు. రెండేళ్ల వయసునుంచే ప్రశ్నించేతత్వాన్ని అలవరచుకున్న ఈ బుడతడు...తనకు వింతగా అనిపించే ప్రతీదానిపైనా తల్లిదండ్రులకు ప్రశ్నలు సంధిస్తుంటాడు.
ప్రయోజకుడిని చేస్తాం
వికాస్ చెప్పే సమాధానాలు విని ఏదో బట్టీపట్టి ఇవన్నీ చెబుతున్నాడనుకుంటే పొరపాటే.....ఏదడిగినా చెప్పే బుడతడు... బలవంతంగా కూర్చోబెట్టి అడిగితే మాత్రం నోరు విప్పడు. ఆడుకుంటూ చలాకీగా ఉన్న సమయంలోనే వికాస్ తనలోని ప్రతిభ బయటపెడుతుంటాడు. వికాస్‌కి మంచి విద్యనందించి ప్రయోజకుడిగా చేస్తామని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు.