తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. తనలో కమ్యూనిస్టు డీఎన్ఏ ఉన్నప్పటికీ ప్రజల ఒత్తిడి మేరకే భాజపాలో చేరాల్సి వస్తుందని మీడియా చిట్‌చాట్‌లో భాగంగా వెల్లడించారు. ఒక వ్యవస్థతో వ్యక్తి పోటీ పడటం సాధ్యం కాదన్నారు. ముందు పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇప్పటికే తెరాస రూ.50 కోట్లు ఖర్చు చేసింది..
తనను ఓడించడమే లక్ష్యంగా తెరాస ఇప్పటికే హుజురాబాద్‌లో రూ. 50 కోట్లు ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా, తెరాస మధ్య ఉన్న సంబంధమేంటని ప్రశ్నించినట్లు ఈటల పేర్కొన్నారు. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ అయినట్లు వివరించారు.
కమ్యూనిస్ట్ పార్టీలు కేసీఆర్తోటే..
అనారోగ్య కారణాలతో అమిత్ షా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు కేసీఆర్ మార్గ నిర్దేశనంలో పని చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ కొవిడ్ కారణాలతో దిల్లీలోనే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న ఈటల.. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ధ నివాళులు అర్పించిన అనంతరం స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నట్లు చెప్పారు.
ఇవీ చూడండి : జగన్.. టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు..? జైరామ్ రమేశ్