కృష్ణా డెల్టా ఆయకట్టుకు జులై ఐదో తేదీ నుంచి సాగునీరు విడుదల చేయాలని కృష్ణా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జరిగిన 34వ సలహా మండలి సమావేశంలో మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM JAGAN) అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదల నేపథ్యంలో తొలి ప్రాధాన్యంగా తాగునీటి చెరువులను నింపాలని మంత్రి కొడాలి నాని అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగానే వ్యవసాయ ఆయకట్టును విభజించి సాగునీటిని విడుదల చేయాలని సూచించారు. సాగునీటి విడుదలలో మండలాలు, గ్రామాల మధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.
కాల్వల ద్వారా సాగునీరు విడుదల...
తాగు, సాగునీరును విడుదల చేశాక మిగులు జలాలు ఉంటే వాటితో విద్యుదుత్పత్తి చేయాలనే నిబంధనలున్నా... విభజన చట్టాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ మనకు రావాల్సిన వాటా నీటిని విడుదల చేయకుండా అడ్డుకుంటోందని మంత్రి నాని ఆరోపించారు. ఖరీఫ్ సీజనులో అవసరమైన ఎరువులు, పురుగుల మందులను ఇప్పటికే సిద్ధంగా ఉంచామని తెలిపారు. బందరు కాల్వ ద్వారా లక్ష 51 వేల ఎకరాలకు, కేఈబీ కెనాల్ ద్వారా లక్ష 38 వేల ఎకరాలకు, ఏలూరు కాల్వ ద్వారా 56 వేల ఎకరాలకు, రైవస్ కాల్వ ద్వారా మూడు లక్షల 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.
బ్యారేజీ నిర్మాణానికి అనుమతులు...
కృష్ణానదిపై చోడవరం, మోపిదేవి వద్ద రూ.204 కోట్లతో కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం పాలన అనుమతులు మంజూరు చేసిందని, సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి పంపనున్నామని కలెక్టర్ చెప్పారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో రూ.312 కోట్లతో చేపట్టిన వేదాద్రి ఎత్తిపోతల పథకం పనులు నిర్మాణ దశలో ఉన్నాయని, విజయవాడ కనకదుర్గమ్మ వారిధి నుంచి కోటినగర్ వరకు రూ.123 కోట్లతో చేపట్టిన వరద రక్షణ గోడ నిర్మాణ పనులు మొదలయ్యాయని కలెక్టర్ అన్నారు. విజయవాడ నగరంలో నీటిపారుదల కాల్వలపై రూ.30.70కోట్లతో ఏడు కొత్త వంతెనల నిర్మాణ పనులు చేపట్టనున్నామని వెల్లడించారు.
అరకొరగా నీటి విడుదల...
తెలంగాణ రాష్ట్ర సాగునీటి అధికారులు సహకరించకపోవడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు జోన్-3 కింద మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని రైతులకు 14 టీఎంసీలకు బదులు.. కేవలం 6 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. దీనివల్ల ఎన్‌ఎస్పీ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
ఇదీచదవండి.