VRO Meena : సూర్యుడు భగ్గుమంటున్నా.. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత శరీరాన్ని వేడెక్కిస్తున్నా.. అడుగు బయట పెట్టేందుకే హడలి పోయే పరిస్థితి ఉన్నా.. విధి నిర్వహణలో మహిళా వీఆర్ఓ చూపిన తెగువ ప్రతి ఒక్కరినీ సెల్యూట్ చేయిస్తోంది. మట్టి అక్రమ దందాపై సమాచారం వచ్చిన వెంటనే విధి నిర్వహణలో ఉన్న ఆ అధికారికి ఉష్ణోగ్రత, ఎండ వేడిమి.. ఎలాంటి ఆటంకం కాలేదు. ముందూ వెనుకా చూడకుండా వెంటపడింది. ద్విచక్ర వాహనంపై వెళ్లి అడ్డగించింది. వీఆర్ఓ మీనా చూపిన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
అనుమతి లేకుండా మట్టి తరలింపు... కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు పరిధిలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతూ దిబ్బల నుంచి మట్టి తరలిస్తున్న లారీలను వీఆర్ఓ మీనా అడ్డుకున్నారు. మండుటెండలో చంటి బిడ్డను ఎత్తుకొని మైనింగ్ మాఫియా ను నిలువరించారు. పసుమర్రు లో అక్రమ మైనింగ్ జరుగుతుందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. మీనా తన పరిధిలోని కొత్తూరులో రెండు వాహనాలను సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. మట్టి దిగుమతి వద్ద సీజ్ చేసిన రెండు లారీలకు పెదమద్దాలి వీఆర్వో మీనా అపరాధ రుసుము కట్టించారు. విధి నిర్వహణలో మీనా చూపిన ధైర్య సాహసాలను ప్రజలు అభినందిస్తున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు తనకు సమాచారం రావడంతో వెళ్లి ఆ లారీలు జప్తు చేసినట్లు మీనా వెల్లడించారు.
చంటి బిడ్డతోనే విధులకు హాజరు.. వీఆర్ఓ మీనా 10 నెలల బిడ్డకు తల్లి. ఇంటి వద్ద చిన్నారి ఆలనా పాలనా చూసే వారు లేకపోవడంతో నిత్యం తనతోపాటే చంటిబిడ్డను తీసుకుని విధులకు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మట్టిని అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో ఆమె చంటి బిడ్డతోపాటే క్షేత్రానికి ద్విచక్రవాహనంపై మెరుపు వేగంతో చేరుకుని... మట్టిని అన్‌లోడ్ చేస్తున్న వాహనాలను నిలిపివేశారు. రెండు టిప్పర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించడంతో పాటు.. దాదాపు రెండు గంటలపాటు మండుటెండలోనే చంటిబిడ్డతో కలిసి విధులు నిర్వహించారు.
పామర్రు మండలం పసుమర్రు పంచాయతీ పరిధిలో మట్టి తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. రైతుకు చెందిన దిబ్బను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వి.. టిప్పర్లలో కొత్తపెదమద్దాలి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని తెలిసింది. విషయం తెలిసిన వెంటనే బిడ్డను వెంట తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లాను. మట్టి తరలింపు, వాహన వివరాలు నమోదు చేసి వాహనాలను ఆఫీస్‌కు పంపించడంతో తహసీల్దార్ ఒక్కొక్క టిప్పర్‌కు రూ.5 వేల జరిమానా విధించారు. - మీనా, వీఆర్ఓ