రేపటినుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయం తెరుచుకోనుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇన్ని రోజులు ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తప్పకుండా కోవిడ్ నియమాలను పాటించవలసి ఉంటుందని ఆలయ పాలకమండలి చైర్మన్ సోమినాయుడు తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు దుర్గగుడి ఈవో సురేశ్ బాబు తెలిపారు. రేపు, ఎల్లుండి ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. భక్తులు సూచనలు పాటిస్తూ ఆలయ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలున్నా ఆలయ సిబ్బందికి సెలవు ప్రకటిస్తున్నామని వెల్లడించారు.
దుర్గ గుడి ఆలయంలో నిబంధనలు...
ఈనెల 10వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. కొంతకాలం ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయి. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇవే అమలవుతాయి. మహామండపం ద్వారానే దర్శనం చేసుకుని కిందకు రావాలి. ప్రతిచోట 6 అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లోనే దర్శన టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. మీసేవలో ధర్మ దర్శనానికి టికెట్లు ఉంటాయి. రూ.100 దర్శనం టికెట్లు దేవస్థానం వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి. సందేహాల నివృత్తికి 94934 45000 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. తలనీలాల టికెట్ ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలన్నారు. గంటకు 90 మందికి మాత్రమే తలనీలాల టికెట్లు అందిస్తారు. నదిలో స్నానానికి అనుమతి లేదు. తలనీలాలు ఇచ్చిన వారికి మాత్రమే ఘాట్‌లో స్నానానికి అనుమతి ఉంటుంది. భక్తులు తమ సామగ్రిని ఎవరికి వారు భద్రపరుచుకోవాలి. క్యూలైన్లలో ఎక్కడా ఎవరినీ తాకకుండా ఉండాలని సూచించారు. ప్రతి 2 గంటలకోసారి ఆలయ పరిసరాలు, క్యూలైన్లు శుభ్రపరుస్తారు. ఆలయంలో డిస్ఇన్‌ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు.
భక్తుల ముఖానికి మాస్కు తప్పనిసరి. దగ్గు, జలుబు ఉంటే ఆలయానికి రాకపోవడమే మంచిది. 65 ఏళ్లు దాటినవారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు రావద్దు. కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్నాకే గుడి లోపలికి రావాలి. రూ.300 టికెట్లు రద్దు.. తీర్థాలు, శఠగోపాలు ఉండవు. ఆలయంలో ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందించనున్నారు. ఆలయంలో బస్సులు, లిఫ్టులు ప్రస్తుతానికి అందుబాటులో ఉండవు.
ఇదీ చదవండి: శాంతి మంత్రానికే భారత్- చైనా మొగ్గు: ఎంఈఏ