విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాలక మండలి సభ్యురాలు నాగవరలక్ష్మి వాహనంలో తెలంగాణ మద్యం లభ్యం కావడం కలకలం రేపింది. వైకాపా కార్యకర్త అయిన ఆమె భర్త వెంకట కృష్ణప్రసాద్, కారు డ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పదవిని అడ్డం పెట్టుకుని ప్రసాద్ వాహనంపై బోర్డు తగిలించి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం ధరలు భారీగా పెరిగిన తర్వాత తెలంగాణ సరకు విచ్చలవిడిగా వస్తోంది. పలువురు దీన్నే వ్యాపారంగా చేపట్టారు. సరిహద్దు ప్రాంతంలో మండలానికొక నాయకుడు మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. వారు మినహా ఇతరులు మద్యం రవాణా చేస్తే పోలీసులకు సమాచారం వెళుతుందని ప్రచారం వైకాపాలోనే ఉంది. దుర్గగుడిలో ఇటీవల వెండి సింహాల చోరీ ఘటన ఇంకా కొలిక్కి రాకముందే ఈ వివాదం తెరమీదకు వచ్చింది. గతంలోనూ అమ్మవారి చీర దొంగతనం కేసులో అప్పటి పాలకవర్గం సభ్యురాలిపై ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులు సైతం తాము మనసు పడ్డ పట్టుచీరలను లెక్కల నుంచి తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆడిట్‌లోనూ ఈ విషయాలు తేలాయి. దుర్గగుడి పాలక మండలి సభ్యత్వం కోసం పోటీ తీవ్రంగానే ఉంటుంది. ప్రభుత్వమే ఈ కమిటీని నియమిస్తుంది. రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న దుర్గగుడి పాలక మండలిలో స్థానం అంటే.. సాధారణ విషయం కాదు. ప్రభుత్వ విప్‌గా ఉన్న సామినేని ఉదయభాను సిఫార్సుతోనే నాగవరలక్ష్మికి పాలక మండలిలో స్థానం లభించింది.
జగ్గయ్యపేటలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారు నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు
దుర్గగుడిలో నెయ్యి టెండరు రద్దు
ఇంద్రకీలాద్రి: దుర్గగుడిలో నెయ్యి టెండరుకు సింగిల్ టెండరు రావడంతో రద్దు చేసినట్లు దేవస్థానం అధికారులు బుధవారం ప్రకటించారు. దేవస్థానం నెలకు 12వేల కిలోల నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగిస్తారు. నెల రోజుల క్రితం టెండరు పిలిచినప్పుడు సంగం డెయిరీ నుంచి మాత్రమే స్పందించారు. సింగిల్ టెండరు అని దానిని రద్దు చేసి రెండోసారి పిలిచారు. మళ్లీ సింగిల్ టెండరు రావడంతో రద్దు చేసినట్లు ఈవో చెప్పారు.
ఇదీ చదవండి