విజయవాడ నడిబొడ్డున బెంజిసర్కిల్ వద్ద పైవంతెనలు రావడం సంతోషమే అయినప్పటికీ సర్వీసు రహదారులు లేకపోవడంతో కాలనీవాసులు నానాయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం రెండువైపులా సర్వీసు రహదారులు కుంచించుకుపోయాయి. వీటిని విస్తరిస్తేనే పై వంతెనలు కట్టిన ఆనందం మిగులుతుంది.
ఇది పటమటలంక వైపు వెళ్లే రహదారి. బెంజిసర్కిల్ పైవంతెన నిర్మాణంతో సర్వీసు రహదారి లేకుండా పూర్తిగా మూసుకుపోయింది. పటమటలంక వాసులు పోరాడి మరీ అండర్‌పాస్ సాధించారు. ఇక సర్వీసు రహదారి లేకపోవడంతో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. బెంజిసర్కిల్ రెండోదశ పై వంతెనకు కూడా సర్వీసు రహదారులు ఇలానే మూసుకుపోతున్నాయి.
గురునానక్ కాలనీ వైపు మరీ దారుణంగా కుంచించుకుపోయింది. రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే తప్పించుకోవడం కష్టమే. భూసేకరణ లేకుండా, సర్వీసు రహదారులను వేయకుండా పైవంతెన నిర్మిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలపై స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తాజాగా సర్వీసు రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలిసింది. అక్కడ ఆమోదం పొందితేనే ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణం చేపడుతుంది.
మూడు మీటర్లే..: అప్రోచ్ రహదారితో కలిపి మొత్తం పైవంతెన దూరం 2,330 మీటర్లు (2.33కి.మీ)చేరుకుంది. మొత్తం 13.50మీటర్ల వెడల్పుతో పైవంతెన నిర్మాణం జరిగింది. ఏలూరు వైపు నుంచి చెన్నై వెళ్లే వాహనాలు పైవంతెన మీదుగా వెళుతున్నాయి. బెంజిసర్కిల్ వాణిజ్య కూడలి. ఇక్కడ మల్టీప్లెక్సులు; అయిదు నక్షత్రాల హోటళ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ సర్వీసు రహదారి ప్రాముఖ్యం చాలా ఉంది. నిబంధనల ప్రకారం సర్వీసు రహదారి 7 మీటర్ల వరకు ఉండాలి. జాతీయ రహదారి (ఆరువరసలు) దెబ్బతినకుండా పైవంతెన రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. సర్వీసు రహదారి 3 మీటర్ల కంటే తక్కువకు వచ్చింది. సర్వీసు రహదారిలో ఎదురెదురుగా వాహనాలు వచ్చేందుకు అనుమతి ఉంది. దీంతో ఇరుకు సందుల్లో వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. నోవాటెల్ వైపు మరీ ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 570 మీటర్ల వరకు ఇక్కడ పైవంతెనకు గోడ నిర్మాణం చేశారు.
ప్రతిపాదనలు పంపాం..: నారాయణ, పీడీ, ఎన్‌హెచ్‌ఏఐ
స్థానికుల కోరిక మేరకు సర్వీసు రహదారుల విస్తరణకు ప్రతిపాదనలు ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు పంపాం.
భూసేకరణ సమస్య..!
సర్వీసు రహదారులకు భూసేకరణ సమస్యగా మారింది. ఫకీరుగూడెం వైపు బందరు కాలువ వరకు అప్రోచ్ రహదారి వెళ్లింది. వాస్తవంగా ఇక్కడ సర్వీసు రహదారి కావాలంటే కాలువపై మరో వంతెన నిర్మాణం చేయాలి. ఇక్కడ కూడా సర్వీసు రహదారి సమస్యగా మారింది. మొత్తం రెండు వైపులా సర్వీసు రహదారి కోసం దాదాపు హెక్టారు స్థలం కావాల్సి ఉంటుందని అంచనా. ప్రస్తుతం అత్యవసరంగా 0.3 హెక్టార్లు సేకరిస్తేనే సర్వీసు రహదారి కనీసం 7 మీటర్లు ఉంటుంది. దీనికి సుమారు రూ.21 కోట్లు వరకు అవసరం ఉంది. భూసేకరణకు నిధులు ఇచ్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐ తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ సొమ్ము భరించే పరిస్థితి లేదు. ఇరువైపులా భూసేకరణకు సుమారు రూ.50కోట్ల వరకు అవసరం ఉంటుందని అంచనా. కొన్ని భవనాలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తం పరిహారం కింద రూ.75 కోట్లకు మించదని అధికారులు చెబుతున్నారు. తాము భూసేకరణకు సిద్ధమని స్థానికులు అంగీకారం తెలిపారు
ఇదీ చదవండి:
Covid Test Kit: దేశంలోనే మొదటి కొవిడ్ ర్యాపిడ్ ఎలక్ట్రానిక్ కిట్
WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...