చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో వైకాపా సభ నిర్వహించడం అవివేకమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సొంత గ్రామమైన చిన్న పల్లెటూరులో నిర్వహించే సభలో మంత్రులు పాల్గొనడం ప్రభుత్వ దాడిగా భావిస్తున్నామని ఆయన విమర్శించారు. సభ నిర్వహణ ద్వారా చంద్రబాబుని రెచ్చగొట్టడానికి, చులకన చేయడం, దుర్భాషలాడటానికి వైకాపా నేతల నీచ బుద్ధి ప్రదర్శించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ముఖ్యమంత్రి జగన్, మంత్రులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజధాని రైతులు నిరసన తెలపటానికి అనుమతి ఇవ్వని పోలీసులు నారావారిపల్లెలో వైకాపా నేతలకు సభ నిర్వహణకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. రంగంపేటలో వైకాపా సభకు ప్రజా స్పందన లేకపోవటం ఆ పార్టీ నేతలకు చెంపపెట్టని వర్ల రామయ్య విమర్శించారు.
3 రాజధానులకు మద్దతుగా చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ప్రజల ఆదరణ కరువయ్యిందన్నారు. నారావారిపల్లెలో బలవంతాన సభలు నిర్వహించి, 3 రాజధానుల నిర్ణయాన్ని ఆమోదించుకోవటానికి పోలీసుల బలగాన్ని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దొంగ సభలు పెట్టి, నకిలీ రిపోర్టులు సృష్టించి మోసం చేయటాన్ని ప్రజలు తిరస్కరించినట్లయ్యిందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'పింఛన్ల తొలగింపుపై ప్రతిపక్షాలవి అసత్య ప్రచారాలు'