మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, వసంత కృష్ణప్రసాద్‌లపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్‌కు బుధవారం లేఖ రాశారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన మీడియా సమావేశంలో... తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాలపై ఈ ముగ్గురు నేతలు బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో పేర్కన్నారు. బాధ్యతగల పదవుల్లో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడే విధంగా బహిరంగ బెదింపులు చేస్తే పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించటం తగదని స్పష్టం చేశారు. ముగ్గురు నేతలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజల్లో విశ్వాసం పెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వర్ల రామయ్య లేఖలో కోరారు.
మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును చంపేస్తామని బెదిరించిన మంత్రి కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్బాబులతో కలిసి వర్ల రాయయ్య విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు.