ఆధార్‌కార్డుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు యూఐడీఏఐ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. విజయవాడ మారుతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్ కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆధార్‌కార్డులో తన కుమారుడు వివరాల్లో పురుషుడుకు బదులుగా మహిళ అని నమోదు చేశారని పెనమలూరుకు చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగినా ఎవ్వరూ మార్చలేదని .. ప్రత్యేక డ్రైవ్ లో నైనా తమ సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో వచ్చానని తెలిపాడు.
ఒక మహిళకు ఆధార్‌కార్డులో వివరాలన్నీ సరిగానే ఉన్నా.. అధికారులు ఆన్ లైన్ లో పరిశీలించగా మరో మహిళ పేరు వస్తుండడంతో ప్రభుత్వ పథకాలు తమకు అందట్లేదని ఆమె వాపోయింది. ఇంకొక వ్యక్తి ఆధార్‌కార్డు , రేషన్‌కార్డుల్లో తన వయస్సు వేర్వేరుగా నమోదు కావటంతో పెన్షన్ తీసుకోలేకపోతున్నానని కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇలా ఏళ్ల తరబడి సమస్యలు అపరిష్కుతంగా మిగిలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడికి వచ్చిన వారు చెపుతున్నారు. కృష్ణా జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది బాధితులు వచ్చారని అధికారులు చెపుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు ఈ డ్రైవ్ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'అమ్మఒడి డబ్బులను.. నాన్న బుడ్డి ద్వారా తిరిగి లాక్కుంటున్నారు'