సినీరంగ ప్రముఖులు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సహా పలువురు హీరోలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సీఎం సారథ్యాన జరిగే ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితో ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా... టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం చర్చించనున్నారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలిసింది.
రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా..
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సాయంపైనా సీఎంతో సినీ ప్రముఖులు చర్చిస్తారని సమాచారం. కొవిడ్ తొలిదశలో లాక్ డౌన్ కారణంగా 3నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత తెరచుకున్నా 50 శాతం సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంతమాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా చర్చించనున్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం ఉండటం, అలాగే టికెట్ రేట్ల పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తున్నందున.... బుధవారం సీఎంతో మంత్రి పేర్ని నాని సమావేశమై చర్చించారు.
కొందరితోమే చర్చలు సరికాదు
సినీ పరిశ్రమ సమస్యలపై కేవలం కొందరితో చర్చించడం సరికాదని... దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం హాట్‌టాపిక్
ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది. ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు సినిమా హీరోలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ధరల విషయంపై కమిటీ అధ్యయనం పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టికెట్ ధరలను ఏ మేరకు పెంచాలన్న దానిపైనా, ఇటు ప్రజలకు, అటు సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్ రేట్లు ఎంత ఉండాలన్న దానిపైనా కమిటీ సభ్యులు నివేదికను రూపొందించారు. ఈ నివేదికలోని అంశాలను మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌కు వివరించారు. అంతేకాదు, థియేటర్‌లలో మౌలిక సదుపాయాలు, క్యాంటీన్‌లో ఆహార పదార్ధాల ధరలపైనా కమిటీ చేసిన అధ్యయనాన్ని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈనెల 10న టాలీవుడ్ పెద్దలు.. సీఎం జగన్ ను కలవనున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు, థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా, సినిమా రంగానికి ప్రభుత్వపరంగా అందాల్సిన సహకారంపైనా చర్చించనున్నారు.
ఇదీ చదవండి: