వైకల్యాలన్నీ కంటికి కనపడవు అనే నినాదంతో కృష్ణా జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏడాది మానసిక వైకల్యం, దీర్ఘకాలిక నొప్పి, అలసట, దృష్టి లోపం, వినికిడి లోపంపై అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించారు. మండల స్థాయిలో కార్యక్రమ నిర్వహణకు ఎస్‌ఎస్ ప్రత్యేక అవసరాల గల పిల్లల విభాగం మూడు వేల రూపాయల బడ్జెట్‌ను మంజూరు చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ప్రత్యేక విద్యార్థులకు గత నెల 30వ తేదీ నుంచి పాటలు, క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్, నృత్య పోటీలు, క్రీడలు నిర్వహించారు. విజేతలకు గురువారం మండల స్థాయిలో బహుమతి ప్రదానం చేయనున్నారు.
ఇంటి వద్ద వ్యాయామ చికిత్స: జిల్లాలో 2,486 మంది ప్రత్యేక అవసరాలుగల పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరికి 74 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు బోధనతో కూడిన శిక్షణ ఇస్తున్నారు. 17 మంది వ్యాయామ వైద్యులు పని చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లల ఇళ్లకు వెళ్లి వీరు ఫిజియోథెరపీ చేస్తున్నారు. గురువారం నిర్వహించే దివ్యాంగుల దినోత్సవాన్ని ఎంఈవోలు, ఐఈఆర్టీ ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని ఎస్‌ఎస్ సహిత విద్య సమన్వయకర్త శ్రీకాకుళపు రాంబాబు కోరారు. డీఈవో ఎమ్వీ రాజ్యలక్ష్మి, ఎస్‌ఎస్ ఏపీసీ జి.రవీందర్‌తోపాటు తాను కూడా వేర్వేరు మండలాల్లోని కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు.
ఇదీ చదవండి:
సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు 14 రోజుల రిమాండ్.. కర్నూలు జైలుకు తరలింపు