తెలంగాణ రాష్ఠ్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్పల్లి సమీపంలో పులి అడుగు జాడలు గుర్తించిన స్థానికులు వెంటనే ఆటవీశాఖ ఆధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధికారులు.. పులి అడుగు జాడలేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సమీపంలోని నిమ్మగూడెం అటవీప్రాంతంలో నాలుగు రోజుల క్రితం మేతకు వెళ్లిన ఆవు.. పులి దాడిలో మృతి చెందింది. ఆవు కళేబరాన్ని యజమాని గుర్తించగా ఇక్కడ సైతం పులి అడుగులను అధికారులు గుర్తించారు. జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అడవులను నుంచి గోదావరి మీదుగా మండలంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.
నెల క్రితం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో పులి సంచారం కనిపించింది. ప్రస్తుతం గోదావరిలో వరద తీవ్రత అధికంగా ఉండటం వల్ల అది ఇక్కడే సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇరవై ఏళ్ల తరువాత స్థానికంగా మళ్లీ పులి ఉనికి కనిపించడం వల్ల జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు