ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక కొరత లేదన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నాక మొదటి సారిగా సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై సుమారుగా రెండు గంటల పాటు చర్చలు జరిపారు. కనకదుర్గమ్మ వారధి నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో రెండున్నర లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని భయపడాల్సిన పనిలేదని మంత్రి అన్నారు. ఐదు నియోజకవర్గాల్లోని పంటపొలాలకు సాగునీరు కావాలని ఎమ్మెల్యేలు అడిగారని ఆయన తెలిపారు. ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి