గుణదలకు చెందన రమాదేవి, శేఖర్ దంపతులు. వారికి అర ఎకరం సాగు భూమి ఉంది. అదే జీవనాధారం. దీంతో తెల్లకార్డు ద్వారా వచ్చే సరకులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డు తొలగించి దాని స్థానంలో బియ్యం కార్డులు అందించింది. అందులో వీరికి బియ్యం కార్డు రాలేదు. అదేమంటే.. మీకు 11 ఎకరాల భూమి ఉంది.. బియ్యం కార్డు ఎలా ఇస్తారు..? అంటూ సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రజాసాధికార సర్వేలో తప్పుగా నమోదు కావడంతో రమాదేవి కుటుంబానికి రేషన్ కార్డు రద్దయింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
పాయకాపురానికి చెందిన హసీనాకు రేషన్‌కార్డు ఉండేది. భర్త, ఇద్దరు పిల్లలు. భర్త ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తారు. ఆమె రేషన్‌కార్డు తొలగించారు. బియ్యం కార్డు ఇవ్వలేదు. ఈ నెల నుంచి సరకులు లేవు. తమకు ఎందుకు తొలగించారని ఆరా తీస్తే.. హసీనా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఉన్నారని సమాధానం. తన కుటుంబంలో ఎవరూ లేరని అధికారుల చుట్టూ తిరిగితే... ప్రకాశం జిల్లాకు చెందిన కొంతమంది పేర్లు కలిసినట్లు తేలింది. వాటిని ఎలా తొలగిస్తారనేది తేలాల్సి ఉంది.
ఇలాంటి కేసులు ఒకటి రెండు కాదు.. వేల సంఖ్యలో ఉన్నాయి. వివిధ కారణాలతో జిల్లాలో 81,027 మందికి రేషన్‌కార్డులు తొలగించారు. కుటుంబానికి నలుగురు సభ్యుల చొప్పున 3.25లక్షల మందికి రేషన్ వస్తువులు అందకుండా పోతున్నాయి. డిసెంబరు నుంచి వీటిని నిలిపివేశారు. ఆరు అంశాల ఫార్ములా ప్రకారం వీటిని రద్దు చేసినట్లు తెలిసింది. అదే సమయంలో కొత్తగా బియ్యం కార్డులు 1,13,857 కుటుంబాలకు ఇచ్చారు. స్థూలంగా రేషన్ కార్డుల సంఖ్య పెరిగినట్లు కనిపించినా తొలగించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. 6 అంశాల ప్రాతిపదికన పలు కుటుంబాలు రేషన్‌కార్డు రద్దు కావాల్సి ఉంది. కానీ అలా ఎవరికీ చేయలేదు. కొన్ని మాత్రం నిలిచిపోయాయి. గత మార్చి నెల నుంచి కొవిడ్ వల్ల ఉచిత రేషన్ అందించడంతో తమ రేషన్‌కార్డులపై ఎవరూ దృష్టి సారించలేదు. కానీ డిసెంబరు నుంచి రేషన్ సరకులు సబ్సిడీ ధరలపై ఇస్తున్నారు. దీంతో తమ కార్డులు గల్లంతైనట్లు గుర్తించారు. గతంలోనే వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుల జాబితాలను ప్రదర్శించారు. బియ్యం కార్డులు పంపిణీ చేశారు. కొంతమందికి అందలేదు.
మరోసారి పరిశీలన..!
ప్రస్తుతం తొలగించిన కార్డులతో పాటు మరికొన్ని కుటుంబాలు ఈ జాబితాలో చేరనున్నాయి. వార్డు వాలంటీర్ల ద్వారా విచారణ జరిపించి కార్డులు రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రధానంగా విద్యుత్తు వాడకంపై దృష్టి సారించనున్నారు. నెలవారీ బిల్లు 300 యూనిట్లు దాటితే రేషన్‌కార్డు రద్దు చేస్తారు. ఏ ఒక్క నెల కాకుండా ఏడాది లేదా ఆరు నెలల సగటును తీయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరు నెలల సగటు 300 యూనిట్లు దాటితే కార్డు రద్దు అవుతుంది. దీని వల్ల కొన్ని కుటుంబాలకు ప్రయోజనం ఉంటుందని, కొన్ని కుటుంబాలకు కార్డు రద్దు అవుతుందని అంటున్నారు. పట్టణ, నగరప్రాంత వాసులపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలు.. టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలను వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసి వినియోగించేవారు ఉన్నారు. ఇలాంటి వారిపై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ ఉద్యోగం లేదా ఒప్పంద ఉద్యోగం ఉన్నా కార్డు రద్దు కానుంది. ఆదాయపన్ను కట్టేవారికి రద్దు కానుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు.. తమ మూల వేతనంలోనే ఆదాయపన్ను యజమాని మినహాయిస్తారు.
మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు..!
రేషన్ కార్డు రద్దు అయినట్లు అనుమానం ఉంటే పరిశీలన చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని సంయక్త కలెక్టర్ కె.మాధవీలత స్పష్టం చేశారు. గతంలోనే జాబితాలు ప్రదర్శించామని, ఆరు అంశాల ప్రాతిపదికన మాత్రమే బియ్యం కార్డులు జారీ అయ్యాయన్నారు. కొత్త కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి అర్హతలు ఉంటే బియ్యం కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండీ...