GANJA SALES: విజయవాడలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా మత్తు దందా జరుగుతోంది. కొన్ని విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఉంచారు. విద్యాసంస్థల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా గంజాయి విక్రయాలను అరికట్టేందుకు నిందితులపై పీడీ యాక్ట్, నగర బహిష్కరణ విధిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలోనే పది మంది విక్రేతలను నగర బహిష్కరణ చేశారు.
మరో ఇద్దరిపై పీడీ యాక్ట్‌ను అమలు చేశారు. ఒకటి కన్నా ఎక్కువ గంజాయి కేసులున్న నిందితులు, తరచుగా విక్రయాలకు పాల్పడుతున్న వారిని గుర్తించారు. వారిపై నిఘా ఉంచి విడతల వారీగా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ సీపీ కాంతిరాణా చెబుతున్నారు. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, నున్న, మాచవరం, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కొందరిని గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళను తొలిసారి నగర బహిష్కరణ చేశారు.
అజిత్ సింగ్ నగర్‌కు చెందిన సారమ్మ అనే మహిళ మత్తు పదార్థాలను విక్రయిస్తూ పలుసార్లు అరెస్ట్ అయింది. అంతేకాదు జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయినా కూడా ఆమె తన తీరును మార్చుకోలేదు. నిందితురాలిపై 12 కేసులు గంజాయి విక్రయాలకు సంబంధించినవే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పటమట పీఎస్‌కు చెందిన ప్రభుదాస్, అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సాయిమహేశ్, కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సాయికిరణ్, వెంకటేశ్, కరిముల్లా, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరీష్, సలీం, నున్న పోలీస్ స్టేషన్‌కు చెందిన మొహమ్మద్ కరీం, పడ్డా దుర్గారావులను నగరం నుంచి బహిష్కరించారు. వీరిపై ఐదు కన్నా ఎక్కువ కేసులే నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మహేశ్‌తో మరో నిందితునిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.
ఇలా విజయవాడ నగర పరిధిలో ఏడాదిన్నర కాలంలో 81 కేసులు కేసులు నమోదు చేసి 192 మంది నిందితులను అరెస్ట్ చేసి 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరు మత్తుకు బానిసై విక్రేతలుగా మారారని విచారణలో పోలీసులు గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సప్లయిర్స్, ట్రాన్స్పోర్టర్స్ ద్వారా రవాణా చేయిస్తున్నారు. ట్రాన్స్పోర్టర్స్ మత్తు పదార్థాలను విక్రేతలకు అందజేస్తారు. పెడలర్స్ సిటీలో ఉన్న మరికొందరికి విక్రయించటం, నేరుగా గంజాయిని సేవించే వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గతేడాది విశాఖ ఏజెన్సీలో వేల ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేశారు. దీంతో ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయి ప్రస్తుతం అధికంగా రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా గంజాయి విక్రేతలు, ట్రాన్స్ పోర్టర్స్‌ను అరెస్ట్ చేయగలుగుతున్న పోలీసులు సప్లయిర్స్పై దృష్టి పెట్టలేకపోతున్నారు. కీలకమైన వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నందున కష్టమవుతుందని .. స్థానిక పోలీసుల సహాయం తీసుకుని అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మత్తుపదార్థాల విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెబుతున్నారు.
"ఏడాదిన్నర కాలంలో విజయవాడ నగర పరిధిలో 81 గంజాయి కేసులు నమోదు చేశాము. 192 మంది నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. వీరిలో కొందరు మత్తుకు బానిసై విక్రేతలుగా మారారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సప్లయిర్స్, ట్రాన్స్ పోర్టర్స్ ద్వారా రవాణా చేయిస్తున్నారు. ట్రాన్స్ పోర్టర్స్ మత్తు పదార్థాలను విక్రేతలకు అందజేస్తారు. పెడలర్స్ సిటీలో ఉన్న మరికొందరికి విక్రయించటం, నేరుగా గంజాయిని సేవించే వారికి విక్రయిస్తున్నట్లు మేము గుర్తించాము." - కాంతిరాణా, విజయవాడ సీపీ
ఇవీ చదవండి: