చట్ట నిబంధనల మేరకు అవసరం అయిన అనుమతి పొందకుండా కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలో కళ్యాణ మండపం నిర్మించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు విధి నిర్వహణలో విఫలమవ్వడంతో పిటిషనర్ అనధికారిక కళ్యాణ మండపం నిర్మిచారని తెలిపింది. అధికారులు, పిటిషనర్ వంటి వారి చట్టవిరుద్ధ చర్యలను చూస్తూ న్యాయస్థానం సాక్షిగా ఉండబోదని తేల్చిచెప్పింది. పామర్రు గ్రామంలోని ఆర్ఎస్ నంబరు 122-11లోని 39 సెంట్లలో పిటిషనర్ అనుమతి లేకుండా నిర్మించిన కళ్యాణ మండపం కూల్చివేతకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ , జిల్లా పంచాయతీ అధికారి ,పామర్రు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది. కూల్చివేత ఖర్చులు పిటిషనర్ భరించాలంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఈనెల 15న ఈమేరకు తీర్పు ఇచ్చారు.
పామర్రు గ్రామపంచాయతీ అప్పటి కార్యదర్శి అనుమతితో తనకు చెందిన స్థలంలో 2011 జనవరి 25 నాటికి కల్యాణ మండపం నిర్మించానని.. తర్వాత అధికారులు అది అనధికారిక కట్టడం అంటూ ఉత్తర్వులు జారీచేశారని పేర్కొంటూ ఏఎన్ రమేశ్ అనే వ్యక్తి 2011లో హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. అధికారుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఏపీ గ్రామ పంచాయతీ భూ అభివృద్ధి నిబంధనలు -2002 ప్రకారం టౌన్ , కంట్రీ ప్లానింగ్ అధికారి ఆమోదం లేకుండా పిటిషనర్ కళ్యాణ మండపం నిర్మించారని తెలిపారు. పిటిషనర్ గ్రామ పంచాయతీకి పెట్టుకున్న దరఖాస్తును టౌన్ , కంట్రీ ప్లానింగ్ అధికారి పంపించామన్నారు. అక్కడి నుంచి ఆమోదం రాకముందే నిర్మాణం చేశారన్నారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి అప్పటి పంచాయతీ కార్యదర్శి సమక్షంలోనే పిటిషనర్ నిర్మాణం జరిపినట్లు స్పష్టం అవుతోందన్నారు. అధికారులు అనధికారిక నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారన్నారు. సంజీవరెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా నివేదిక ఇవ్వాలని లోకాయుక్త కోరడంతో అధికారులు అప్పుడు స్పందించి పిటిషనర్‌కు నోటీసు ఇచ్చారని ఆక్షేపించారు. అధికారుల చట్ట వ్యతిరేక కార్యకాలపాల విషయంలో న్యాయస్థానం ప్రేక్షకపాత్ర పోషించదని తేల్చిచెప్పారు. పిటిషనర్ నిర్మించిన కల్యాణ మండపం కూల్చివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేశారు.
ఇదీ చదవండి: కోర్టు ధిక్కరణ కేసులో తహశీల్దార్ మహేశ్వరరెడ్డికి జైలు శిక్ష