కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల 09 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న వరదనీటిని దిగువకు యథాతథంగా సముద్రంలోనికి విడిచి పెడుతున్నట్టు జలవనరుల శాఖ స్పష్టం చేసింది.
ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి 3.44 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. నారాగ్జున సాగర్ నుంచి 3.33 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 4.12 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో మళ్లీ ప్రకాశం బ్యారేజికి వరద నీటి ప్రవాహాలు పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 57.05 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. 3.06 టీఎంసీల పూర్తి సామర్ధ్యంతో నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని యథాతథంగా సముద్రంలోకి విడుస్తున్నారు. కృష్ణా, పశ్చిమ తూర్పు డెల్టా ప్రాంతాలూ నీట మునిగే ఉండటంతో కాలువలకు నీటిని విడుదల నిలిపివేశారు.
ఇదీ చదవండి: 'భూముల రీసర్వే.. ప్రతీ కమతానికీ ప్రత్యేక గుర్తింపు నెంబర్'